దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టడంతో గత కొంత కాలంగా భరత్ భూషణ్ బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. తాజాగా తిరగబెట్టిన క్యాన్సర్ కి తోడు వారికి మల్టిపుల్ సమస్యలున్నాయి. షుగర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్స్ కూడా ఉన్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ ప్రముఖ ఫోటోగ్రాఫర్ Bharat Bhushan ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా Cultural Ambassador of Telanganaగా ఎదిగిన భరత్ భూషణ్ warangal జిల్లాకు చెందినవారు. వరంగల్లులో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు.
ఫోటోగ్రఫీ అనేది కొందరి వల్ల సిగ్నేచర్ స్టైల్ గా పేరొందింది. తెలుగునాట సమకాలీన చరిత్రలో అలాంటి ఘనులలో ఒకేఒక్కడు భరత్ భూషణ్. తెలంగాణ బతుకు చిత్రాలను తన ఫోటోగ్రఫీ ద్వారా చిత్రీకరించిన భరత్ భూషణ్ ఇప్పటివరకు 7 వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు. బతుకమ్మ, తెలంగాణలోని పల్లె దర్వాజాలు ఆయన ఫోటోలలో ఎక్కువగా కనిపిస్తాయి.
కరువు కాటకాలు, వలసలు, సమస్త విధాలా జీవన విధ్వంసం, వీటి తాలూకు పర్యవసానాలను అయన చిత్రాలు చెబుతాయి. అదే సమయంలో బతుకు పట్ల విశ్వాసాన్ని, జీవన వైవిద్యాన్ని, అందలి ఈస్తటిక్స్ తో సహా అవి ఆవిష్కరిస్తాయి.
అయన ఫొటోలలో ఇండ్లు, కూలిన గోడలు, దర్వాజాలు, గొల్లం పెట్టినవే కాదు, తాళం వేసిన ఇండ్లు, దీపం లేని దిగూడులు, వాకిట్లో ముగ్గులు, వంటింట్లో వస్తు సామాగ్రి కనిపిస్తాయి. మొత్తంగా తెలంగాణ పల్లె జీవితం చక్కగా ఆవిష్కృతమవుతుంది ఆయన చిత్రాల్లో. దైనందిన జీవితాన్నే కాదు, పండుగలను పబ్బాలనూ చిత్రీకరించారు. ముఖ్యంగా నిలువెత్తు తెలంగాణ జీవన వ్యాకరణాన్ని అయన గోడల మీది రాతలతో సహా సంక్షిప్తం చేశారు. చెరపలేని చరిత్రకు ఆనవాలు భరత్ భూషణ్ ఫొటోలు.
అన్నిటికన్నా ప్రధానంగా భరత్ భూషన్ బొడ్డెమ్మను, బతుకమ్మను - ఆటా పాటాలతో తెలంగాణ నిర్దిష్ట చారిత్రక వాస్తవికతను సాంస్కృతిక వైభవాన్ని ఎంతో అపురూపంగా చిత్రించి పది కాలాలకు అందించడం ఎంతో విలువైన కృషి.
సాంస్కృతిక రంగంలోనే కాదు, సాంఘీకంగా రాజకీయంగా కూడా తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేసిన ఎంతోమంది మూర్తిమత్వాన్ని భరత్ భూషణ్ ఎంతో హుందాగా చిత్రించారు. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారిని అయన ఎంతో బాధ్యతగా ఫొటోలు తీసి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసింది భరత్ భూషణ్ గారే.
అస్మిత ఆధ్వర్యంలో వచ్చిన ‘మహిళావరణం’ భరత్ భూషణ్ ఛాయాచిత్ర విశిష్టతను చాటే మరో ప్రయత్నం. అందులో చాకలి ఐలమ్మ చిత్రం ఒక మణిపూస. మనకు తెలియని మన మహిళా మణులను కళ్ళ ముందు నిలిపిన ఆ ప్రయత్నంలో ఈ ఒక్క చిత్రం చాలు, భరత్ భూషణ్ ఫొటోగ్రఫీ ఎంత విలువైనదో తెలపడానికి.
భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకళ వంటి వెండితెర చిత్రాలకు వారు ఫొటోగ్రఫీ చేశారు. భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టుగా మరో విశిష్ట కృషి వ్యాసరచన. తెలుగు జర్నలిజంలో జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాశారు. ఒక ఫోటోగ్రాఫర్ పరిశీలన ఎంత నిశితంగా ఉంటుందో తెలియడానికి మన కంటికి కానరాని ఎన్నో లోతైన అంశాలను ఆయ వ్యాసాల్లో వారు తడిమి రాయడం విశేషం.
దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టడంతో గత కొంత కాలంగా భరత్ భూషణ్ బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. తాజాగా తిరగబెట్టిన క్యాన్సర్ కి తోడు వారికి మల్టిపుల్ సమస్యలున్నాయి. షుగర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్స్ కూడా ఉన్నాయి.
తనకు ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ఆయన భయపడేవారు కాదు. ‘మృత్యువుకి కళ అంటే బీతి అని, అందుకే అది తననింకా కబలించివేయలేదని’ ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుండేవారు. “ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా నా శరీరం అంటుకోదు. కాలిపోదు. కళా ప్రస్థానంలో నేను చేయవలసిన పనులు మిగిలే ఉన్నాయి. అవి తీరేదాకా నాకు మరణం లేదు” అన్నారాయన ఇటీవలే మాట్లాడుతూ అంతలోనే విషాదం చోటు చేసుకుంది.
