Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం నాడు ఉదయం హైద్రాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
 

senior journalist potturi venkateswara rao passes away in Hyderabad
Author
Hyderabad, First Published Mar 5, 2020, 10:43 AM IST

హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం నాడు ఉదయం హైద్రాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

1934 ఫిబ్రవరి 8వ తేదీన గుంటూరులో పొత్తూరి వెంకటేశ్వరరావు జన్మించారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన పత్రికా రంగంలో సేవలందించారు.


1957లో ఆంధ్ర జనతా పత్రికలో తొలిసారిగా ఆయన పాత్రికేయుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు, ఆంద్రభూమి, ఆంధ్రప్రభ,వార్త దినపత్రికల్లో ఆయన సంపాదకులుగా పనిచేశారు. 

సమకాలీన రాజకీయ అంశాలపై పలు పత్రికల్లో ఆయన వ్యాసాలు రాశారు. ఈ తరం జర్నలిస్టులకు పొత్తూరి వెంకటేశ్వరరావు జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తోంది.

సాహిత్యం, సంస్కృతి, రాజకీయ అంశాలపై ఆయన అనేక రచనలు చేశారు. నాటి పత్రికల మేటి విలువల పేరుతో ఆయన ఓ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం 2000 సంవత్సరంలో విడుదలైంది.2001లో పొత్తూరి వెంకటేశ్వరరావు చిరస్మరణీయులు అనే పుస్తకాన్ని రాశారు.అదే సంవత్సరంలో చింతన అనే పుస్తకం రాశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ గా ఆయన పనిచేశారు.  మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గురించి ఇయర్స్ ఆఫ్ పవర్  పుస్తకానికి ఆయన సహ రచయితగా ఉన్నారు.

డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగంలో ప్రముఖులుగా నిలిచారు. అనేక పరిణామాలని, మార్పులని చూశారు. ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ పత్రికలతో అపార అనుభందం ఉంది. ఆంధ్ర ప్రభ వార్తా పత్రిక సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు. ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తద్వారా తెలుగు భాషాభ్యున్నతికి కారకులైయ్యారు. వారే డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు. తెనుగు భాషా వికాస దోరణి ఆయన్ను ఎప్పుడూ వీడలేదు. నేటికీ ఆయన తెలుగు సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. 

దాదాపు నూట యాబై యేళ్ళ తెలుగు పత్రికా చరిత్రను ఆకళించుకుని నిలువటద్దంగా నిలిచారు  పొత్తూరి వెంకటేశ్వర రావు. నాటి పత్రికా విలువలు ఎరిగిన వారు. నేడు ఈ విలువలు ఎలా మారి పోయాయో, ఏ కారణాల చేత మారిపోయాయో తెలిసిన వారు.

 తెలుగు సాహిత్యం పట్ల పొత్తూరి వారి నిష్ఠ అపారమైనది. నిశితమైన దృక్కు కలిగి ఉన్న వ్యక్తి. యావత్ తెలుగు పత్రికా చరిత్రనెరిగిన మేటి సంపాదకులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు.

ఓ మేటి పాత్రికేయుడిలో ఉండవలసిన సలక్షణాలన్నీ డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావులో చూడ వచ్చు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ అంశాలలో అపారమైన జ్ఞానం సంతరించుకున్నారు.

నాటి పత్రికలు విలువలు పాటించేవి. సంపాదకులు నడిపించేవారు. నేడు పరిస్థితి వేరు. యజమానులే నడిపిస్తున్నారు. పత్రికలను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడుతున్నారు. టీవీ చానల్స్ రేటింగులకి ప్రాధాన్యం ఇస్తున్నాయి, విలువలు పడిపోయాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పొత్తూరి వెంకటేశ్వరరావు 

తెలుగు సాహిత్య జగత్తులో గత అరవై యేళ్ళుగా సాగుతున్న కృషిని, పరిణామాలని ఒక్కరి ద్వారా వినాలి అనుకుంటే అది డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు  అని చెప్పవచ్చు. వారి అనుభవం అపారమైనది. సాహిత్య ప్రియులందరికీ ఆయన అందుబాటులో వుంటారు. సభలలో తరచు పాల్గొంటారు. ఓ మంచి మాట చెబుతారు. అభిమానించి అడిగితే ఔత్సాహిక సాహిత్యకారులకి సైతం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పొత్తూరిని  డాక్టరేట్ పట్టాతో గౌరవించింది.కొన్ని దశాబ్దాల తెలుగు పత్రికలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) రూపంలోకి మళ్ళించి అంతర్జాలం (ఇంటర్ నెట్) మీద అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ పథకం అవిష్కరించారు వెంకటేశ్వరరావు.

డాక్టర్ పొత్తూరి గారి రచనలు, సామాన్య భాషలో, సూటిగా ఉంటాయి. వీరి వ్యాసాలు, రచనలు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి. డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి రచనలలో కొన్ని ముఖ్యమైనవి:

తెలుగు పత్రికలు
నాటి పత్రికల మేటి విలువలు
చింతన
చిరస్మరణీయులు
కాశీనాధుని నాగేశ్వరరావు
పారమార్ధిక పదకోశం

చింతన - శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావుగారు వ్రాసిన ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనం. 

చిరస్మరణీయులు - స్ఫూర్తిగా నిలచిన మహనీయుల మీద వ్రాసిన సంపాదకీయాల సంకలనం. ఇవి ఇదివరలో "ఆంధ్రప్రభ" లో వెలువడ్డాయి. తరువాత పుస్తక రూపం దాల్చాయి.

నాటి పత్రికల మేటి విలువలు - తెలుగులో ఏ పత్రికలు ఏయే భావాలతో పుట్టాయో, ఏమి ప్రత్యేకతలు సంతరించుకున్నాయో, మహనీయులు ఎలా శ్రమించారో ఈ రచనలో వివరించారు.

తెలుగు పత్రికలు - తెలుగు పత్రికల చరిత్రకు అద్దం పట్టేది ఈ గ్రంధం. విషయ అవగాహనతో, పరశోధనా శక్తితో, కృషి, దీక్షా పట్టుదలతో వ్రాసినది ఈ గ్రంధం.

వ్యాస ప్రభ - సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ ఇత్యాది అంశాల మీద అనేక సంకలనాలు తన కలం ద్వారా, సంపాదకీయం ద్వారా ప్రజల ముందుకి తీసుకొచ్చారు. దాదాపు 160 వ్యాసాలు, ఈ సంకలనంలో వెలయించారు. 

టిటిడి ప్రచురణలకు సంపాదకుడిగా ఉన్నారు. 

పొత్తూరి వెంకటేశ్వరరావు  చాలా కాలం బ్రిటీష్ లైబ్రరి సభ్యత్వం ఉండేది. అంతర్జాల (ఇంటర్ నెట్), లాప్ టాప్ లు అందుకోవడంతో ఇవి వారి సాధనోపకరణాలుగా తయారైయ్యాయి.

ఐదు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు వెంకటేశ్వరరావు గారు. నేటికీ ఆయన తెలుగు భాషాభివృద్ధికి తన వంతు సహాయం నిస్సంకోచముగా అందిస్తున్నారు. ఇలాటి అనుభవ పూర్ణ తెలుగు భాషా విశారధుల ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios