హైదరాబాద్: కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ అమర్‌నాథ్  మంగళవారం నాడు కరోనాతో మరణించాడు.  కరోనా చికిత్స కోసం ఆయన 10 రోజుల క్రితం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. కరోనాకి చికిత్స తీసుకొంటూ ఇవాళ మరణించాడు. ఆంగ్లం లో వెలువడిన సోవియట్ యూనియన్ పత్రిక సోవియట్ భూమి పేరు తో తెలుగులో ప్రచురించే వారు.  సోవియట్ భూమి లో సబ్ ఎడిటర్ గా అమర్నాథ్ జర్నలిస్టు జీవితం ప్రారంభం అయింది. 

సోవియట్ భూమి పత్రిక కు తాపి ధర్మారావు కుమారుడు తాపి రాంమోహన్ రావు ఎడిటర్ గా ఉండేవారు. ఆయన శిష్యుడిగా  అమరనాథ్ మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు.  ఆ తర్వాత విశాఖపట్నం లో విశాలాంధ్ర లో కొంతకాలం పాటు పనిచేసి 1982లో  గజ్జల మల్లారెడ్డి  ఆంధ్రభూమి ఎడిటర్ గా ఉన్న సమయం లో అమర్నాథ్ సబ్ ఎడిటర్ గా చేరారు. ఆంధ్రభూమిలో న్యూస్ ఎడిటర్ స్థాయి కి ఎదిగారు. 

న్యూస్ ఎడిటర్ గా విజయవాడ, రాజమండ్రీ, హైదరాబాద్ లో పనిచేసి 2008 లో  ఉద్యోగ విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి గా,  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శిగా, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. 

అమర్నాథ్ ఆంధ్రభూమి దినపత్రికలో చాలా కాలం పనిచేశారు. జర్నలిస్టు యూనియన్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నాయకుడిగా ఆయన విశేష కృషి చేశారు. ఆయన మృతికి జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కరోనాతో మరణించిన అమర్ నాథ్ అంత్యక్రియలు బుధవారం నాడు  ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్తానంలో నిర్వహిస్తారు.

సీనియర్ జర్నలిస్ట్ అమర్ నాథ్ మృతిపట్ల  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  ఆయన మరణం జర్నలిస్ట్ లకు, సమాజానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.