సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ మృతదేహం వద్ద  సెల్ఫీ దిగిన కామినేని ఆస్పత్రి సిబ్బంది ఉద్యోగాలు ఊడిపోయాయి. గత బుధవారం నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద రహదారి ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే.

 ప్రమాదం జరగగానే చికిత్స నిమిత్తం ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించగా అక్కడున్న ఇద్దరు నర్సులు, ఒక వార్డుబాయ్‌, ఒక ఆయా హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ  దిగుతున్న చిత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం హరికృష్ణ అభిమాని ద్వారా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై మీడియా ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది.

హరికృష్ణకు చికిత్స అందించే సమయంలో ‘సెల్ఫీ’ దిగి తప్పిదానికి పాల్పడిన సిబ్బందిని తొలగించినట్లు కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎడ్విన్‌ లూథర్‌ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో ఆసుపత్రిలో కొందరు సిబ్బంది అనాగరిక, అమానుష ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు. హరికృష్ణ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

read more news

దారుణం.. హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ.. వైరల్