హైదరాబాద్: ప్రపంచంలో నడుస్తోంది సెల్ఫీ ట్రెండ్. అందరికీ ఇష్టమైన ప్రాంతానికి వెళ్లిన వాళ్లు తమ సంతోషాన్ని సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు కనబడిన, ఒక కొత్త ప్రాంతానికి వెళ్లినా, ఒక వింతగా కనిపించినా ఇక సెల్ఫీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు జనాలు. 

అయితే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో తానే మెుదటి ఓటు వేశానని చెప్పేందుకు గాను లేకపోతే మెుదటిసారిగా ఓటు వేస్తున్న వ్యక్తి ఉత్సాహంతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పోలింగ్ బూత్ లో సెల్ఫీని ఎన్నికల కమిషన్ నిషేధించింది.అంతేకాదు సెల్ ఫోన్ ను కూడా నిషేధించింది.

అలా అత్యుత్సాహంతో ఎవరైనా సెల్ఫీ దిగితే కొంపమునిగినట్లే. మీరు ఎవరిని అయితే గెలిపించాలనుకుని తాపత్రాయపడుతున్నారో వారిని గెలిపించడంలో మీ పాత్ర ఉండదు అదెలా అనుకుంటున్నారా...మీరు ఓటువేస్తూ సెల్ఫీ దిగితే ఆ ఓటును 17 ఏలో నమోదు చేస్తారు. 

ఎప్పుడైతే ఆ ఓటును 17-ఏలో నమోదు చేశారో అది కౌంటింగ్ సమయంలో పరిగణలోకి తీసుకురాదు. దాన్ని కౌంట్ చెయ్యరు. అందుకే ఓట్ వేసేముందు సెల్ఫీ దిగితే ఆ ఓటు గంగలో పోసినట్లే. అందుకే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లకపోవడం మంచిది.

ఇకపోతే పోలింగ్ బూత్ లో తాను ఫలానా వాళ్లకి ఓటు వేస్తున్నాను. ఓటు వేస్తాను. నువ్వు కూడా వెయ్యు అని చెప్పడం నేరంగా పరిగణిస్తారు. అందువల్ల పోలింగ్ బూత్ లో ఓటుపై చర్చించకూడదు. చర్చించవచ్చు కానీ ఎవరికి ఓటు వేస్తానో వెయ్యాలో అన్నది చెప్పడం మాత్రం నేరం. ఆత్మప్రబోధాను సారం ఓటు వెయ్యాలని చెప్పేది అందుకే.

మరోవైపు ఎన్నికల్లో దొంగ ఓట్లు వెయ్యడం పెద్ద నేరం. ఎవరైనా వ్యక్తి తన ఓటు కాకుండా వేరే వారి ఓటును వేస్తే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తుంది ఎన్నికల కమిషన్. అలా ఎవరైనా దొంగ ఓటు వేశారని రుజువు అయితే 6 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు. సో ఓటు వేసే ఓటర్లు తస్మాత్ జాగ్రత్త.