Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ బుకింగ్ ప్రారంభం.. చార్జీలు, సిట్టింగ్ వివరాలు ఇవే..

దేశంలో 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు తీయనుంది.

Secunderabad Visakhapatnam Vande Bharat Express ticket booking begins check fares seats timings and other deatials
Author
First Published Jan 14, 2023, 11:11 AM IST

దేశంలో 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు తీయనుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌‌. అలాగే దక్షిణ భారతదేశంలో రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇక, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు.. జనవరి 16 నుంచి రెగ్యూలర్‌గా రాకపోకలను సాగించనుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. 

ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందించనుంది. సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య 699 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ రైలు (20833) విశాఖపట్నం నుంచి 05:45 గంటలకు బయలుదేరి 14:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ  45 నిమిషాల బ్రేక్ ఉంటుంది. అనంతరం (20834) సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 15:00 గంటలకు బయలుదేరి..  23:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణంలో నాలుగు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఆ జాబితాలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లు ఉన్నాయి. 

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టికెట్ బుకింగ్స్..
ఈ రైలులో 14 ఏసీ చైర్ కార్ కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. మొత్తం 1,128 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో ఇవి ఉన్నాయి. 20833/20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ బుకింగ్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, ఇంటర్నెట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ఐఆర్‌సీటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 20833 విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సీట్ల వివరాలను పరిశీలిస్తే.. సాధారణ బుకింగ్ కోసం.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో మొత్తం 57 సీట్లు,  ఏసీ చైర్ కార్‌లో 627 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏసీ చైర్ కార్ ఛార్జీ:
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు – రూ. 1,720
విశాఖపట్నం  నుంచి రాజమండ్రికి - రూ. 625
విశాఖపట్నం  నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 960
విశాఖపట్నం  నుంచి ఖమ్మం వరకు – రూ. 1,115
విశాఖపట్నం  నుంచి వరంగల్ - రూ. 1,310

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ:
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు– రూ. 3,170
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 1,215
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 1,825
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 2,130
విశాఖపట్నం నుంచి వరంగల్ - రూ. 2,540

ఇక, 20834 సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సీట్ల వివరాలను పరిశీలిస్తే.. సాధారణ బుకింగ్ కోసం.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో మొత్తం 57 సీట్లు,  ఏసీ చైర్ కార్‌లో 751 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏసీ చైర్ కార్ ఛార్జీ:
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం  వరకు – రూ. 1,665
సికింద్రాబాద్  నుంచి రాజమండ్రికి - రూ. 1,365
సికింద్రాబాద్  నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 905
సికింద్రాబాద్  నుంచి ఖమ్మం వరకు – రూ. 7,50
సికింద్రాబాద్  నుంచి వరంగల్ - రూ. 520

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ:
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం  వరకు – రూ. 3,120
సికింద్రాబాద్  నుంచి రాజమండ్రికి - రూ. 2,485
సికింద్రాబాద్  నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 1,775
సికింద్రాబాద్  నుంచి ఖమ్మం వరకు – రూ. 1,460
సికింద్రాబాద్  నుంచి వరంగల్ - రూ. 1,005

ఇక, ఈ రైలులో ఫుడ్ చాయిస్ ఆప్షనల్‌గా అందుబాటులో ఉంది. అయితే ఎవరైనా నో ఫుడ్ ఆప్షన్‌ని ఎంచుకుంటే.. క్యాటరింగ్ ఛార్జీలు ఛార్జీలు తీసివేయబడతాయిన ఐఆర్‌సీటీసీ పేర్కొంది. 

ప్రారంభం రోజు మాత్రం..
సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడవనున్న వందేభారత్‌ రైలును ఆదివారం ఉదయం 10.30గంటలకు వర్చువల్‌గా ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. తొలి రోజు ప్రయాణంలో భాగంగా ఈ రైలు.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్‌, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగనుంది. అయితే 16వ తేదీ నుంచి మాత్రం కేవలం నాలుగు  స్టేషన్‌లలో మాత్రం ఈ రైలు హాల్టింగ్‌ ఉండనుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios