తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో కరీంనగర్ జైలు పరిసరప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమీషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరీంనగర్ : టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన తెలంగాణ బిజెపి చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇవాళ కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సిపి ప్రకటించారు.
శుక్రవారం ఉదయం 6 గంటల నుండి కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో వుంటుందని సిపి తెలిపారు. కరీంనగర్ జిల్లా జైలు పరిసర ప్రాంతాలతో పాటు ఐబీ చౌరస్తా, గ్రేవ్ యార్డ్, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మొహరించారు. ఆయా ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా తిరగడం, సభలు, ఊరేగింపులు, రోడ్ షో లు నిర్వహించకూడదని సిపి స్ఫష్టం చేసారు.
144 సెక్షన్ అమల్లో వున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు పోలీసులు. అలాగే బారీకేడ్లు ఏర్పాటు చేసి జైలు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బండి సంజయ్ విడుదల సమయంలో భారీగా బిజెపి శ్రేణులు వచ్చే అవకాశాలు వుండటంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Read More నీ బిడ్డ, కొడుకు జైలుకే: జైలు నుండి విడుదలయ్యాక కేసీఆర్‌పై బండి ఫైర్
బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై హన్మకొండ కోర్టులో గురువారం సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి.సంజయ్ తరపు న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వరంగల్ సిపి కౌంటర్ పిటిషన్ వేసారు. బండి సంజయ్ ను 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ కస్టడీ పిటిషన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
సంజయ్ బెయిల్ పిటిషన్ ను కూడా సోమవారానికి వాయిదా వేయాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే వరుసగా మూడు రోజులు సెలవు వస్తున్నందున బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత హన్మకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ మంజూరు చేసిన కోర్టు సంజయ్ కొన్ని షరతులు విధించింది. సాక్షులను బెదిరించవద్దని, ఆధారాలు తారుమారు చేయరాదని పేర్కొంది. అలాగే, విదేశాలకు వెళ్లకూడదని తెలిపింది. ఇద్దరి పూచీకత్తుతో బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తు కూడా తీసుకుంది.
Read More టెన్త్ పేపర్ లీక్ కేసు .. రేపు విచారణకు హాజరుకాలేను : వరంగల్ డీసీపీకి ఈటల రాజేందర్ లేఖ
ఇక బండి సంజయ్ కు బెయిల్ మంజురవడంతో కరీంనగర్ బిజెపి జిల్లా శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచకుంటూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు .ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనడానికి సంజయ్ కి బెయిల్ మంజూరు అవ్వడమే నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని... ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బిజెపి కార్యకర్తలు హెచ్చరించారు.
