తెలంగాణలో స్కూల్స్ ఇవాళ ప్రారంభమయ్యాయి. 18  మాసాల తర్వాత స్కూల్స్  తిరిగి ప్రారంభించారు. ప్రత్యక్ష క్లాసుల విషయంలో విద్యాసంస్థలకే నిర్ణయాన్ని హైకోర్టు వదిలేసింది. అయితే ప్రత్యక్ష తరగతులకు రావాలని ఒత్తిడి తీసుకురావొద్దని కూడా హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత విద్యాసంస్థలు పున:ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో విద్యా సంస్థలను తిరిగి తెరుచుకోవచ్చవని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.ఈ నివేదిక ఆధారంగా విద్యాసంస్థలను పున:ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. ప్రత్యక్ష క్లాసుల విషయంలో నిర్ణయాన్ని విద్యాసంస్థలకే వదిలేసింది.

ప్రత్యక్ష క్లాసులకు హాజరు కావాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని కూడ హైకోర్టు ఆదేశించింది.రెసిడెన్షియల్స్, హాస్టల్స్ తెరవకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
స్కూల్స్ లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు మాస్కులు కచ్చితంగా ధరించాలని కోరింది. స్కూల్స్ లో మాస్కులు, శానిటేషన్ అందుబాటులో ఉంచాలని కోరింది. మరోవైపు స్కూల్స్ పరిసరాలను ఆగష్టు చివరి నాటికే శుభ్రం చేశారు.

18 మాసాల తర్వాత తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ ను పరీక్షిస్తున్నారు. సరైన ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేశారు. హైద్రాబాద్ నగరంలో సుమారు 12 ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.