మహబూబాబాద్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్‌కి చెందిన బస్సు 16 మంది విద్యార్ధులతో వెళ్తుండగా వరద నీటిలో చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు పిల్లలను రక్షించారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండేళ్లుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్‌కి చెందిన బస్సు 16 మంది విద్యార్ధులతో వెళ్తుండగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బస్సు మధ్యలోనే ఆగిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు 16 మంది పిల్లలను సురక్షితంగా రక్షించి వారి ఇళ్లకు తరలించారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరోవైపు.. నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు.
Also Read:Hyderabad Rains: మక్కా మసీద్ ఆవరణలో ప్రమాదం.. భారీ వర్షానికి కుప్పకూలిన మదద్‌ఖానా భవనం
భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
