వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్గింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం పక్కాగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినపిస్తున్నాయి. మంగళవారం వరంగల్ పర్యటన తీరు చూసి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. 

కేటీఆర్ వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి స్థాయి ఏర్పాట్లు చేశారు. అధికారులు, నాయకుల హడావిడి కూడా అదే స్థాయిలో ఉంది. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు నిట్ క్యాంపల్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అధికార పార్టీ నాయకులు క్యూ కట్టారు. 

ఆ తర్వాత ఐటి కంపెనీల వద్దకు వెళ్లేందుకు కాన్వాయ్ సిద్ధమవుతుండగా కేటీఆర్ ఓక్కసారిగా డ్రైవర్ సీట్లో కూర్చున్ినారు. సైయెంట్ కంపెనీ అధినేత బీవీ మోహన్ రెడ్డి బెంజ్ కారును కేటీఆర్ తన కాన్వాయ్ లోని ఇతర వాహనాలతో సమానంగా తోలారు. 

మంత్రుల కాన్వాయ్ లో సాధారణంగా అంబులెన్స్ ఉండదు. కేటీఆర్ కు మాత్రం అంబులెన్స్ తో పాటు రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా ఎంట్రీ పాస్ లు అందజేశారు. మంత్రి నడుపుతున్న కారును ప్రైవేట్ వాహనంగా భావించి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలిపేశాడు. దాంతో కాస్తా కలకలం చోటు చేసుకుంది.