పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని అహర్నిశలు కష్టపడ్డ ఓ అభ్యర్థి ఆ క్రమంలోనే మృత్యువాతపడడం సూర్యాపేట జిల్లాలో విషాదం నింపింది.
సూర్యాపేట : ఎస్సై ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన ఓ యువకుడు.. ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆ యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ (25) ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల కోసం సిద్ధం కావడానికి స్థానిక ఎస్వి డిగ్రీ కళాశాల మైదానంలో రోజూ సాధన చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే మంగళవారం మైదానంలో పరుగులు తీస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం వెంటనే సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. త్వరలో ఎస్సై ఉద్యోగము సాధిస్తాడనుకున్న కన్నకొడుకు ఆకస్మాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
‘‘ముందస్తు’’ లేదంటూనే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న కేసీఆర్ .. దీని వెనుకా వ్యూహామేనా..?
ఇదిలా ఉండగా, దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుని తెల్లారి పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండె అకస్మాత్తుగా ఆగింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి, కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. వెంకట్రావు పల్లికి చెందిన బుర్ర కుషిత-సతీష్ దంపతులకు కొడుకు కౌశిక్ (9), కుమార్తె మేఘన ఉన్నారు. కాగా, బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన క్యూ లైన్‌లో నిల్చున్న మూడో తరగతి విద్యార్థి బుర్ర కౌశిక్ (8) గుండెపోటుతో మృతి చెందాడు.
కౌశిక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలిచి ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. అది గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు వాహనంలోని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత (హార్ట్ వీక్) వ్యాధితో చిన్నారి బాధ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
