టీఆర్ఎస్ఎల్పీ , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారిగా టీఆర్ఎస్‌ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది. గుజరాత్ ఎన్నికల్లో పోటీతో పాటు ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే కథనాలు విస్తృతంగా ప్రచారం జరిగాయి. కానీ వీటన్నింటికి తెరదించుతూ.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే దీని వెనుకా ఆయన ఎత్తుగడ వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు .
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగాల్సి వుంది. దాదాపు ఏడాది కాలం వున్న ఈ సమయంలో అసెంబ్లీని రద్దు చేసినా ... కేంద్రం తన విచక్షణాధికారంతో ఆరు నెలల పాటు ఎన్నికలను వాయిదా వేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి తోడు జ్యోతిష్యాన్ని బలంగా నమ్మే కేసీఆర్... తన జాతకాన్ని అనుసరించి ఫలానా సమయంలో ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం దక్కుతుందనే లెక్కలు వేసుకుని ప్రస్తుతానికి ముందస్తును వాయిదా వేశారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా.. బీజేపీ ఉపఎన్నికలు తెచ్చే ఆలోచన కూడా చేయదని కేసీఆర్ నమ్ముతున్నారు. ఏదాడిలో ఎన్నికలు పెట్టుకుని అభ్యర్ధుల చేత అంత ఖర్చు పెట్టించే సాహసం చేయరని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేసి ఎవరినైనా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలన్నా రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. అలాగే ఈసీ నుంచి ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరో నెల , రెండు నెలలు ఖచ్చితంగా పడుతుంది. అందుకే అప్పటి పరిస్థితులను బట్టి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈడీ దాడులను పార్టీ నేతలు ఉపేక్షించవద్దని సూచించారు. ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడే ధర్నాలు చేయాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికలకు పదిమాసాల సమయం ఉందని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికలకు నేతలంతా సన్నద్దం కావాలని .. ప్రజలతో గ్యాప్ లేకుండా చూసుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం కోరారు. ప్రతి నిత్యం నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని కేసీఆర్ ఆదేశించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సీనియర్ నేతలను ఇంచార్జీగా నియమించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో చేసిన సోదాలకు సంబంధించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఆయా సంస్థలు తమ పనులు తాము చేసుకుంటూ పోతాయన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్రజాప్రతినిధులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు.
