గత రాత్రి శాతవాహన ఎక్సెప్రెస్ రైలు ఖమ్మం జిల్లాలో ప్రయాణిస్తూ పెద్దశబ్దంతో సడన్ గా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయంతో రైలుదిగి పరుగుతీసారు. 

ఖమ్మం : ఒడిషా రైలుప్రమాదం సృష్టించిన మారణహోమం తర్వాత ట్రైన్ ప్రయాణమంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రైలు ప్రయాణంలో చిన్న కుదుపు వచ్చినా, చివరకు సిగ్నల్ కోసం ఆగినా ఏ ప్రమాదం ముంచుకొచ్చిందోనని భయపడపోతున్నారు. ప్రయాణికులు భయపడినట్లుగానే సాంకేతిక కారణాలు, మానవ తప్పిదాలతో రైలుప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగురాష్ట్రాల మధ్య నడిచే శాతవాహన ఎక్స్ ప్రెస్ ఖమ్మం జిల్లాలో పెద్ద శబ్దంతో ఆగిపోయింది. బ్రాకెట్ ఇన్సులేటర్లతో పాటు విద్యుత్ తీగలు తెగి మంటలు చెలరేగి రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు పరుగు తీసారు. 

వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులను ఎక్కించుకుని సోమవారం మధ్యాహ్నం శాతవాహన ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. రాత్రికి ఖమ్మం జిల్లాకు చేరుకున్న రైలు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఆగిపోయింది. మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ను, విద్యుత్ తీగలను అనుసంధానం చేసే బ్రాకెట్ ఇన్సులేటర్లు ఒక్కసారిగా విరిగి రైలు బోగిలపై పడిపోయాయి. దీంతో పెద్ద శబ్దంతో విద్యుత్ నిలిచిపోయి రైలు సడన్ గా ఆగిపోయింది. 

బ్రాకెట్ ఇన్సులేటర్లు బోగీలపై పడటంతో స్వల్పంగా మంటలు వచ్చాయని ప్రయాణికులు చెబుతున్నారు.అలాగే రైలుపట్టాల పక్కనే విద్యుత్ తీగలు కూడా తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరా వుండే ఈ తీగలు రైలుపై పడివుంటే పెను ప్రమాదం జరిగివుండేది. 

Read More కేవలం తుమ్మినందుకే ఇంత దారుణమా... వీళ్లసలు మనుషులేనా..!

అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ప్రయాణికులు పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే ట్రైన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అందకారంగా మారింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయిన ప్రయాణికులు రైలు దిగి పరుగుపెట్టారు.దగ్గర్లోనే మధిర రైల్వే స్టేషన్ వుండటంతో ప్రయాణికులంతా అక్కడికి చేరుకున్నారు. 

సాకేంతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. దీంతో రెండుగంటల తర్వాత శాతవాహన ఎక్స్ ప్రెస్ మధిర రైల్వేస్టేషన్ నుండి బయలుదేరింది.