ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎం.నటరాజన్ తమిళనాడు ప్రభుత్వంలో పిఆర్ఓ గా పనిచేసిన నటరాజన్
గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం.నటరాజన్ (73) తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన మరణించారు. తమిళనాడు రాజకీయ నాయకురాలు శశికళ భర్త ఎం.నటరాజన్ చాలా కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. భార్య జైలులో ఉన్న సమయంలో ఆయన అనారోగ్యం కారణంగా పలుమార్లు శశికళ పెరోల్ మీద బయటకొచ్చారు.
గత ఏడాది అక్టోబర్ నెలలో మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు నటరాజన్. అయితే రెండు వారాల క్రితం అనారోగ్యం కారణంగా చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

గతంలో తమిళనాడు ప్రభుత్వంలో పిఆర్ఓ గా పనిచేశారు నటరాజన్. 1975లో శిశికళను పెళ్లి చేసుకున్నారు. విద్యార్థి దశలో హిందీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. జయలలిత మరణం సమయంలో శశికళ రాజకీయ వ్యూహాల రచనలో ఆయన కూడా భాగస్వామ్యం ఉందని చెబుతారు.
