మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు నవ్య ఇంటికి రాజయ్య వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మీడియా ఎదుటే నవ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.  

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య .. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య దంపతులను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్తున్నారు రాజయ్య. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలను సుమోటాగా తీసుకున్న తెలంగాణ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించడంతో రాజయ్య స్పందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. తాను మాట్లాడిన ప్రతి మాట నిజమేనని రాజయ్య సమక్షంలోనే వ్యాఖ్యానించారు. 

ఏ అన్యాయం జరిగినా ఓర్చుకోవద్దని ఆమె మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మహిళలకు అన్యాయం జరుగుతోందని.. అన్యాయాలు, అరాచకాలను సహించవద్దని నవ్య పిలుపునిచ్చారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల్లో అయినా పార్టీలో అయినా మంచి , చెడు వుంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు వేధించినా వారి భరతం పడతానని.. ఏ స్థాయిలో వున్నా మహిళలకు విలువ, గౌరవం ఇవ్వాలని నవ్య కోరారు. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే క్షమిస్తానని ఆమె స్పష్టం చేశారు. 

తాటికొండ రాజయ్యే నవ్యకు మద్ధతుగా నిలిచి గ్రామ సర్పంచ్‌గా చేశారని ఆమె భర్త ప్రవీణ్ తెలిపారు. ఆయన తోడ్పాటుతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ప్రవీణ్ చెప్పారు. మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చిన మాట నిజమేనని ఆయన చెప్పారు. అయితే తమ వ్యక్తిగత సమస్యల కంటే గ్రామ అభివృద్ధే ముఖ్యమని ప్రవీణ్ వెల్లడించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆత్మగౌరవ పోరాటమేనని ప్రవీణ్ వెల్లడించారు. ఆత్మగౌరవాన్ని చంపుకునేందుకు తాము సిద్ధంగా లేమని ఆయన తేల్చిచెప్పారు.