అసెంబ్లీ ఎన్నికలు జరిగి రోజులు గడవకముందే.. తెలంగాణలో మరో ఎలక్షన్స్ , త్వరలోనే నోటిఫికేషన్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి రోజులు గడవకముందే మరో ఎన్నికల పండుగ మొదలుకానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు వున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి రోజులు గడవకముందే మరో ఎన్నికల పండుగ మొదలుకానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు వున్నాయి. రాష్ట్రంలోని సర్పంచ్‌ల పదవీ కాలం 2024 జనవరి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాల కోసం జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
దీనిని అనుసరించి సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు. ఆర్టికల్ 243 ఈ (3)(ఏ) ప్రకారం గ్రామ పంచాయతీల పదవీకాలం ఐదేళ్లు.. ఈ గడువు త్వరలో ముగియనుండటంతో ఈసీ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు, లక్షా 13 వేలకు పైగా వార్డులు వున్నాయి. వీటన్నింటికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగ్గా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలవ్వగా.. కాంగ్రెస్ దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్‌కు 39, కాంగ్రెస్‌కు 64 , బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.