తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని.. అయినవారు, బంధువులతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నగరజీవి పల్లెబాట పట్టాడు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న పలువురు తమ సొంతవూళ్లకు బయలుదేరడంతో రెండు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులు రద్దీగా మారాయి.

ముఖ్యంగా టోల్‌ప్లాజాల వద్ద టోల్ చెల్లించడానికి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో టోల్ వసూలును రద్దు చేస్తున్నట్లు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

పండుగ ప్రయాణాల దృష్ట్యా ఈ నెల 13, 16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద రుసుముల వసూలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, ఎన్‌హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను టోల్ సిబ్బంది పాటించడం లేదు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారులపై వివిధ ప్రాంతాల్లో ఉన్న టోల్‌గేట్లపై అక్కడి సిబ్బంది టోల్ వసూలు చేస్తూనే ఉన్నారు.

తమకు ఎన్‌హెచ్ఏఐ నుంచి ఆదేశాలు రాలేదని వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. టోల్ వసూలు ఆపాలని చెప్పినా టోల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది.