సంగారెడ్డి: తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయారెడ్డి హత్యకు రెవెన్యూ వ్యవస్థలోని అవినీతే కారణమంటూ ఆరోపించారు. హత్యకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోపించారు. 

విజయారెడ్డి హత్యకు ఓ పత్రిక, ఓ మంత్రితోపాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులే కారణమంటూ జగ్గారెడ్డి ఒక వీడియో రికార్డు మీడియాకు విడుదల చేశారు. గతంలో రెవెన్యూ చట్టం రైతులకు, అధికారులకు వెసులుబాటుగా ఉండేదని చెప్పుకొచ్చారు. 

రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ రెవెన్యూ చట్టం మార్పులు రైతులకు అధికారులకు ఇబ్బందిగా మారాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఒక పత్రికలో వస్తున్న శీర్షిక రైతులు అధికారుల మధ్య వైరాన్ని పెంచిందని ఆరోపించారు.

రెవెన్యూ అధికారులపై ఆ శీర్షిక ప్రజల్లో విషాన్ని నూరిపోసిందని ఫలితంగానే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. సీఎం రెవెన్యూ డిపార్టమెంట్ పై వ్యవహరించిన తీరే తహాశీల్థార్ బలికి కారణమైందదని ఆరోపించారు. 

అంతేకాదు సమాజంలో అవినీతిని, లంచాలను అరికట్టడం ఏ నాయకునికీ సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తహాశీల్దార్ మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకులది కూడా తప్పేనని అంటున్నారు జగ్గారెడ్డి. 

కేసీఆర్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలను అంగీకరిస్తూ వస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అందువల్లే తహాశీల్దార్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు, తహాశీల్దార్ చావుకు ఉద్యోగ సంఘాల తీరే కారణమని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారడం ఖాయమని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 tahsildar Vijaya Reddy: నిందితుడు సురేష్ పరిస్థితి ఆందోళనకరం