టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడున్న సెక్రటేరియట్‌లో చేయని పరిపాలన కొత్త సచివాలయంలో ఏం చేస్తారో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

సెక్రటేరియేట్‌లో గుడి కూల్చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కేసీఆర్‌ని ప్రశ్నించే ధైర్యం చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మసీద్ కూల్చేస్తే  అక్బరుద్దీన్, అసదుద్దీన్ రాజకీయం చేసేవారు ఇప్పుడు మాత్రం కేసీఆర్‌కి మద్ధతు ఇస్తూ మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

Also Read:కేసీఆర్ వ్యూహానికి విరుగుడు: తొలిసారి పీవీని స్మరించిన సోనియా గాంధీ

గతంలో అసదుద్దీన్ మియాపూర్ నుంచి పటాన్‌చెరువు వరకు రహదారి వేస్తుంటే వారు  మసీదు గోడను కూల్చనివ్వలేదని జగ్గారెడ్డి గుర్తుచేశారు. అసదుద్దీన్‌కి ప్రభుత్వంలో ఎవరుంటే వారిని పొడటం అలవాటని ఆయన ఎద్దేవా చేశారు.

కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. రూ.500 కోట్లు కరోనా బాధితులకు ఖర్చు పెడితే బ్రతుకుతారని చెప్పారు. కానీ కేసీఆర్‌కి కొత్త సచివాలయం నిర్మించి చరిత్రలో నిలవాలని ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజల ప్రాణాల పట్ల మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనని.. హిందుత్వ పార్టీ అంటారు కానీ బీజేపీ సైతం గుడి కూల్చేస్తుటే మాట్లాడరని జగ్గారెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్ సైతం మందిరం కూల్చేస్తుంటే ఆపలేదని ఆయన నిలదీశారు.

Also Read:కేసీఆర్ సెంటిమెంటు, నూతన సచివాలయం అంతా "6"మయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వెనక నుంచి బీజేపీ.. ముందు నుంచి ఎంఐఎం పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. కేవలం మీరు బ్రతకడం కోసమే మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని.. మీ అందరినీ దేవుడే సమయం వచ్చినప్పుడు చూసుకుంటాడని ఆయన హెచ్చరించారు.