సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రేపు అనుచరులతో కీలక భేటీ నిర్వహించనున్నారు.  కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ అనుచరుల దగ్గర మనస్తాపం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పార్టీ మారుతారా అంటూ ప్రచారం జరుగుతోంది. 

సంగారెడ్డి కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) పార్టీ మారబోతున్నారా..? కాంగ్రెస్‌పై అసంతృప్తితో వున్న జగ్గారెడ్డి రేపు ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నారా..? ఈ మీటింగ్‌లో తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోనున్నారా..? కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ అనుచరుల దగ్గర మనస్తాపం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. గుర్తింపు లేనిచోట పనిచేయడం అవసరమా..? అని ప్రశ్నిస్తున్న జగ్గారెడ్డి .. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిరోజులుగా పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ , నేతల మధ్య కో ఆర్డినేషన్ కరువైందని పలుమార్లు వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. 

జగ్గారెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (revanth reddy) అంటే ఒక్క క్షణం కూడా పడదు. ఆయన అంటే అసలు గిట్టదు. ఇంటా బయటా వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌పై పదునైన విమర్శలు చేస్తూనే వచ్చారు. తొలినుంచి టీఆర్‌ఎస్‌ కోవర్ట్‌గా జగ్గారెడ్డిని రేవంత్‌ వర్గం చిత్రీకరించడం.. ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే రేవంత్‌ రెడ్డిపై బహిరంగంగా విరుచుకుపడుతుంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే. 

ఆమథ్య సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్‌‌తో జగ్గారెడ్డి కలివిడి తిరిగారు. కేసీఆర్‌పై (kcr)ఆయన కుటుంబంపై విమర్శలు ఘాటు కూడా తగ్గించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్ది జగ్గారెడ్డి అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే వాటిని ఖండించిన జగ్గారెడ్డి ... తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతూనే రేవంత్‌ వర్గాన్ని ఒక కంటకనిపెడుతున్నారు. రేవంత్‌ వర్గం సామాజిక మాధ్యమాల్లో తనపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి రేవంత్‌ వర్గంపై దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఇక గత నెలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలోనూ జగ్గారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతో పాటు సోషల్ మీడియాలో పార్టీకి చెందిన కొందరు నేతలను లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ కు కోవర్టులంటూ సాగుతున్న ప్రచారం విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ సందర్భంగా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో జగ్గారెడ్డిని వదులుకోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టమనే అభిప్రాయాలు లేకపోలేదు. జగ్గారెడ్డిని ముందు పెట్టి కొందరు సీనియర్లు రేవంత్ పై ఫిర్యాదులు చేయిస్తున్నారా అనే అనుమానాలను రేవంత్ రెడ్డి వర్గం వ్యక్తం చేస్తోంది. తాను లేవనెత్తిన అంశాలపై ఠాగూర్ పరిష్కరిస్తారని కూడా జగ్గారెడ్డి మీడియాకు చెప్పారు. అయితే సోనియా (sonia gandhi), రాహుల్‌లను (rahul gandhi) కలిసిన తర్వాత తన భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ఎఐసీసీ సెక్రటరీ ఒకరు రంగంలోకి దిగారు. రాష్ట్రానికి చెందిన కొందరు సీనియర్లు కూడా జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్నారని సమాచారం. అదే సమయంలో ఠాగూర్ కూడా పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.