తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారానికి మరికొద్ది క్షణాల్లో బ్రేక్ పడనుంది. ఈ సమయంలో వివిధ పార్టీల నాయకులు చివరిగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తన భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రమాదం పొంచివుందంటూ జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక పోతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. కాబట్టి తన అడ్డు తొలగించుకోవాలని వారు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి రాకుంటే తనకు ప్రమాదం తలపెట్టడం ఖాయమని పేర్కొన్నారు. తనను హత్య చేయడానికి కూడా వారు వెనుకాడారని జగ్గా రెడ్డి తెలిపారు. 

తాను ఎమ్మెల్యేగా వున్న కాలంలో నియోజకవర్గ అభివృద్ది కోసమే పనిచేశానని....ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జగ్గారెడ్డి వెల్లడించారు. కానీ తనపై కావాలనే కబ్జాలు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాను రియల్ ఎస్టేట్ లో సంపాదించిన  డబ్బంతా గతంలోనే ప్రజలకు పంచానన్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఆశీర్వదించాలని జగ్గారెడ్డి కోరారు.