సంగారెడ్డి: కాంగ్రెసు పార్టీపై సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం తాను సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ తర్వాత తాను సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తానని చెప్పారు. 

టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పది మంది ప్రయత్నిస్తున్నారని, తాను 11వ వాడినని ఆయన చెప్పారు. తనకు అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, పార్టీ విజయం కోసం పూర్తి కాలం పనిచేస్తానని ఆయన చెప్పారు. 

Also Read: అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి కన్ను

తనకు అధ్యక్ష పదవి ఇస్తే సంగారెడ్డి నుంచి వేరేవాళ్లను పోటీ చేయించి గెలిపిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణ పిసిసీ అధ్యక్ష పదవి కోసం జగ్గారెడ్డి ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో తనపై ఉన్న కేసుల వివరాలను కూడా పొందుపరిచారు.

తెలంగాణ పిసిసీ అధ్యక్ష పదవి నుంచి నల్లగొండ లోకసభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి సహా పలువురు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డికి పాత సీనియర్ కాంగ్రెసు నేతల నుంచి వ్యతిరేకత ఎదరవుతోంది.