హైదరాబాద్: గజ్వెల్ కాంగ్రెసు నేత వంటేరు ప్రతాప రెడ్డితో పాటు తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కారెక్కుతారని ప్రచారం సాగుతోంది. రేపు శుక్రవారం నాలుగు గంటలకు వంటేరు ప్రతాప రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమక్షంలో గులాబీ కుండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతారని అంటున్నారు. 

సత్తుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున పోటీ చేసి గెలిచిన సండ్ర టీఆర్ఎస్ లో చేరుతారని గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. 

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి కూడా ఆయన రాలేదు. దీంతో సండ్ర సైకిల్ దిగడం ఖాయమని భావిస్తున్నారు. సండ్ర టీఆర్ఎస్ చేరడం ఖాయమని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. 

టీఆర్ఎస్ నేతలు సత్తుపల్లి వెళ్లి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సండ్రతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావును కూడా పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.