ఇల్లెందు: ప్రేమించిన యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఇల్లెందుకు  చెందిన సందీప్, సౌజన్యలు కొద్దిరోజులుగా ప్రేమించుకొంటున్నారు.  అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.ఈ విషయమై మాట్లాడుకొందామని సందీప్ యువతిని పట్టణంలోని శివారు ప్రాంతానికి  గురువారం నాడు రాత్రి తీసుకెళ్లాడు.  అక్కడే ఆమెపై కత్తితో దాడి చేసి ఆమెను అక్కడే వదిలి వెళ్లాడు.

అదే సమయంలో పెట్రోలింగ్ వాహనంలో వస్తున్న పోలీసులకు సందీప్  బట్టలపై రక్తం మరకలు కన్పించాయి.ఈ విషయమై సందీప్ ను పోలీసులు ప్రశ్నించారు. సౌజన్యపై దాడి చేసినట్టుగా సందీప్ చెప్పాడు. వెంటనే  పోలీసులు నిందితుడు సందీప్ ను తీసుకొని సంఘటనస్థలానికి తీసుకెళ్లారు.

అప్పటికే అపస్మారకస్థితిలో సౌజన్య ఉంది.ఆమెను హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.