సంపత్ అసహనం: సర్దిచెప్పిన జానా రెడ్డి, ఇంట్లో సిఎల్పీ భేటీయా..

సంపత్ అసహనం: సర్దిచెప్పిన జానా రెడ్డి, ఇంట్లో సిఎల్పీ భేటీయా..

హైదరాబాద్: ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వ రద్దు విషయాన్ని పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని శాసనసభ్యుడు సంపత్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఆ అంశంపై ఆదివారం జానారెడ్డి నివాసంలో జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. పార్టీ నాయకత్వ తీరుపై సంపత్ తీవ్రంగా మండిపడ్డారు. సభ్యత్వం రద్దయితే ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోయారు, ప్రజలు ఏం భరోసా ఇస్తారని సంపత్ నిలదీశారు.

సిఎల్పీ నేత కె. జానారెడ్డి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. పార్టీ పట్టించుకోలేదనే విషయంలో నిజం లేదని, పార్టీ పట్టించుకుంది కాబట్టే హైకోర్టుకు వారిద్దరి తరఫున వాదించడానికి అభిషేక్ మను సంఘ్వీని పంపించిందని ఆయన చెప్పారు. 

తమకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలువలేకపోయిందని సంపత్ విమర్శించారు. సభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అవసరమైన కార్యాచరణను పార్టీ రూపొందించి, అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారని అన్నారు. 

సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరగలేకపోతున్నానని ఆయన అన్నారు. గన్ మెన్ ల పునరుద్ధరణ కోసమైనా డిజీపిని కలవలేదని ఆయన అన్నారు. జానా రెడ్డి నివాసంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు సిఎల్పీ సమావేశం ఇళ్లలో జరగలేదనే విమర్శ కూడా వచ్చింది. సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ దాటరంటూ విమర్శిస్తూ ఇంట్లో సిఎల్పీ సమావేశం నిర్వహించడమేమిటని అడిగారు. 

సమావేశంలో టీపీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, సంపత్ కుమార్, జీవన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఉండడం వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి రాలేకపోయారు.

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంపై గవర్నర్ కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page