వేసవి కాలం కావడంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మే 18 వరకు తెలంగాణలో 4.23 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. 

వేసవి కాలం కావడంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోత, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి మందుబాబులు బీర్లను లాగించేస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రాజధాని హైదరాబాద్‌లో సైతం ఉదయం 9 గంటలకే భానుడు బాదేస్తున్నాడు. దీంతో రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయి. మే నెలలో కేవలం 18 రోజుల్లోనే 4.23 కోట్ల బీర్లు అమ్ముడవ్వగా.. దీని వల్ల ప్రభుత్వానికి రూ.582.99 కోట్ల ఆదాయం లభించింది. ఎండలకు తోడు మే నెలలో మంచి ముహూర్తాలు వుండటంతో వివాహాలు ఇతర శుభకార్యాలు బాగా జరిగాయి. ఇవి కూడా బీర్ల అమ్మకాలకు ఊపు తెచ్చింది. 

మే 1 నుంచి 18 వరకు 35,25,247 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్క్ కేసుకు 12 బీర్ల చొప్పున లెక్కిస్తే సగటున రోజుకు 23,50,164 బీర్లు విక్రయించారు. అయితే ఇంకా ఎండలు మండిపోతుండటం, త్వరలో రోహిణి కార్తె రానుండటంతో బీర్ల అమ్మకాలు మరింత పెరిగి తద్వారా ఖజానాకు రూ.1000 కోట్ల ఆదయం సమకూరే అవకాశం వుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినప్పటికీ.. సమ్మర్‌లో లిక్కర్ సేల్స్ అంతగా పెరగలేదు, దీనికి బదులుగా మందు బాబులు బీర్ల వైపే మొగ్గుచూపారు. బీర్ల అమ్మకాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాలు టాప్‌లో నిలిచాయి.