రైతు భరోసాపై భట్టి టీం ట్విస్ట్ : ఇక అలాచేస్తేనే పెట్టుబడి సాయం?

తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతికి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తుందా? ఇవాళ రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఏ సిపార్సులు చేయనుంది? రేవంత్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుంది?  

Rythu Bharosa Scheme: Telangana Farmers Await Clarity Amid Policy Changes AKP

Rythu Bharosa : తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయంకోసం మరిన్నిరోజుల ఎదురుచూపులు తప్పేలా లేదు. రైతు భరోసా డబ్బులు సంక్రాంతికి కూడా రైతుల ఖాతాలో పడటం అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వం 'రైతు బంధు' కింద అందించిన పెట్టుబడి సాయం లోపభూయిష్టంగా వుందని ఆరోపిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసింది రేవంత్ సర్కార్. ఈ కమిటీ ఇంతకాలం 'రైతు భరోసా' విధివిధానాలపై కసరత్తు చేసింది. దీంతో ఈ కమిటీ సిపార్సుల ఆధారంగానే రైతు భరోసా అమలు జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతూవస్తోంది. 

ఇవాళ(గురువారం) రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. రైతు భరోసాపై ఇప్పటివరకు జరిపిన కసరత్తుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సబ్ కమిటీ నిర్ణయాలు చూస్తుంటే రైతు భరోసా సంక్రాంతికి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు... మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 

Rythu Bharosa Scheme: Telangana Farmers Await Clarity Amid Policy Changes AKP

రైతు భరోసా ఎదురుచూపులు తప్పవా?  

తెలంగాణ ఏర్పాటుతర్వాత రైతాంగానికి పెట్టబడిసాయం కోసం కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా భూమి వున్న ప్రతి ఒక్కరికి ఎకరాకు రూ.10,000 ఆర్థిక సాయం అందేది. ఏడాదికి రెండు విడతల్లో ఒక్కోసారి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమచేసేవారు. 

అయితే తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా రైతు భరోసాను మాత్రం అమలుచేయడంలేదు రేవంత్ సర్కార్. దసరా, దీపావళి ఇలా ప్రతి పండగ సమయంలో రైతు భరోసా అమలుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ ఈ పథకం అమలుకు నోచుకోవడంలేదు. 

తాజాగా మరోసారి సంక్రాంతికి రేవంత్ సర్కార్ రైతు భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాలో వేస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారైనా తమ ఖాతాల్లో డబ్బులు పడతాయేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు చూస్తుంటే సంక్రాంతికి కూడా అనుమానంగానే కనిపిస్తోంది. 

Rythu Bharosa Scheme: Telangana Farmers Await Clarity Amid Policy Changes AKP

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలివే?

రైతు భరోసా సాయం అందించేందుకు ఎలాంటి భూపరిమితి పెట్టవద్దని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఆదాయపన్ను చెల్లింపుదారులకు కూడా రైతు భరోసా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, పడావు భూములకు మాత్రం పెట్టుబడి సాయం ఇవ్వొద్దని... కేవలం సాగులో వున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ... ఇదే ప్రభుత్వానికి కూడా సిపార్సు చేయనున్నట్లు సమాచారం. 

అంటే కేవలం పంటసాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం వస్తుందన్నమాట. మరి ఏ భూమిలో పంట సాగవుతుంది... ఏ భూమిలో సాగుకావడంలేదు అనేది ఎలా తెలుసుకుంటారు? అనేదేగా మీ అనుమానం. అందుకోసం కూడా మంత్రివర్గ ఉపసంఘం ఓ ప్లాన్ ను రెడీ చేసింది. అధికారులు శాటిలైట్ మ్యాపింగ్, సర్వే ద్వారా సాగుభూములను గుర్తిస్తారని... దీని ఆధారంగానే రైతు భరోసాను అందించాలని ప్రభుత్వానికి సూచించనుంది కేబినెట్ కమిటీ. 

ఇక కేబినెట్ సబ్ కమిటీ భేటీలో తీసుకున్న మరో కీలక నిర్ణయం రైతు భరోసా కోసం రైతుల నుండి దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటివరకు భూమి వున్న ప్రతి రైతుకు రైతు భరోసా అందించారు...కానీ ఇకపై పెట్టుబడిసాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్నమాట.ఈ నెల (జనవరి) 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించే అవకాశం వుంది. 

రేపు (జనవరి 4, శనివారం) జరిగే మంత్రిమండలి సమావేశంలో రైతు భరోసాపై ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ సిపార్సులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిపార్సులను ఈ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

 

ఇప్పుడు రైతు భరోసా ఆరువేలేనా?  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రతిఏటా ఎకరాకు రూ.15,000 రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చింది. స్వయంగా ఆనాటి టిపిసిసి చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హామీ ఇచ్చారు. దీంతో పెట్టుబడి సాయం కింద ప్రతిఏటా రైతు ఖాతాలో ఎకరాకు రూ.15 పడాల్సి వుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న ఇప్పటివరకు రైతు భరోసా అమలుకు నోచుకోలేదు. 

ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు చూస్తుంటే రైతు భరోసా మరింత ఆలస్యం కావడమే కాదు కాస్త తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైతు భరోసా సాయాన్ని రూ.5 వేల నుండి రూ.6 వేలకు మాత్రమే పెంచాలని... ఇలా ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేలు మాత్రమే చెల్లించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మొదట వెయ్యి రూపాయలు పెంచి ఆ తర్వాత మరో పదిహేను వందలు పెంచాలని... క్రమక్రమంగా డబ్బులు పెంచుతూ రూ.7,500 చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే ఇలా రైతు భరోసాను క్రమక్రమంగా పెంచాలన్ని కేబినెట్ సబ్ కమిటీ సిపార్సుపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. తుది నిర్ణయం మంత్రిమండలిలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

మొత్తంగా ఇవాళ రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క,సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కమిటీ సిపార్సులను సిద్దంచేసి రేపు మంత్రిమండలి ముందు వుంచనుంది. వీటిపై తుది నిర్ణయం రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రిమండలిదే. 


 

   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios