Asianet News TeluguAsianet News Telugu

Rythu Bandhu: ఆ రోజు నుంచే రైతు బంధు పంపిణీ.. 10 రోజుల్లో అందరి ఖాతాల్లోకి నగదు: సీఎం కేసీఆర్

యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 28 నుంచి రైతు బంధు నగదు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతుందని సీఎం కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు.
 

Rythu Bandhu from December 28 No paddy purchase centres says KCR
Author
Hyderabad, First Published Dec 19, 2021, 9:45 AM IST

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు (Rythu Bandhu) పథకం కింద రైతులకు ఉన్న భూమిని బట్టి వారి ఖాతాల్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున (Rs 5,000 per acre) పెట్టుబడి సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 28 నుంచి రైతు బంధు నగదు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతుందని సీఎం కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు. పంపిణీ ప్రారంభమైన వారం నుంచి పది రోజుల్లో అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని కేసీఆర్ తెలిపారు. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. యాసంగి వరిధాన్యం సేకరణపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణ, రైతు బంధు విడుదల,  దళితబంధు అమలు, ఉద్యోగుల విభజన, ఒమిక్రాన్‌ వ్యాప్తితో పాటు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువరు మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం, బీమాతో అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగానే.. వరుస క్రమంలో అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని చెప్పారు. దాదాపు 63 లక్షల మంది రైతులకు ఉన్న కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. 

త్వరలోనే దళిత బంధు నిధులు..
ఇదివరకే ప్రకటించిన విధంగా దళిత బంధు పథకాన్ని (dalit bandhu scheme) అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వివక్షకు గురువతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే తమ లక్ష్యమని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు, ఇదివరకే ప్రకటించిన మరో నాలుగు మండల్లాల్లో త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి నిధులను విడుదల చేస్తామని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సూచనల మేరకు 100 మంది చొప్పున లబ్దిదారుల ఎంపిక చేసి దళితబంధును అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలని కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు.

ఉద్యోగుల విభజనపై.. 
రాష్ట్రంలో ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో (telangana) జరుగుతున్న ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ (KCR) కీలక ఆదేశాలు జారీచేశారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ది జరుగుతుందని తెలిపారు. 4,5 రోజుల్లో ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. విభజన పూర్తి చేసి నివేదిక తనకు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.  భార్యభర్తలు అయిన (స్పౌస్) ఉద్యోగులు ఒకేచోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా ఉండగలరని, సమర్ధవంతంగా పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. స్థానిక ఉద్యోగాలకు విఘాతం కలగకుండా స్పౌస్ కేసులను మానవీయ కోణంలో పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. నూతన జోనల్‌ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వపాలన అమలులోకి వస్తుందని చెప్పారు. 

యాసంగిలో కిలో వడ్లు కూడా కొనం..
యాసంగిలో కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు (paddy procurement centres) ఉండవని సీఎం కేసీఆర్ (KCR) మరోసారి స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే చెబుతోందని.. కేంద్రం మొండివైఖరి వల్లనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. రైతుల్లో అవగాహన పెంచే బాధ్యతను అధికారులు తీసుకోవాలని అన్నారు. వచ్చే వానాకాలం పంటలపై కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. వానాకాలంలో ముఖ్యంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.  

 

ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు.. జాగ్రత్తలు పాటించాలి..
ఒమిక్రాన్ వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ పురోగతిని కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఒమిక్రాన్‌ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరంలేదని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అక్కర్లేదని అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios