తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తమ డిమాండ్లు పరిష్కరించనిది.. విధుల్లోకి చేరమంటూ కార్మికులు కూడా భీష్మించుకు కూర్చున్నారు. అయితే... కొందరు కార్మికులు మాత్రం అల్లాడిపోతున్నారు. నెల జీతం మీద ఆధారపడేవాళ్లు...జీతం అందక ఆవేదన చెందుతున్నారు. కొందరు ఆ సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.... మరికొందరు అనారోగ్యానికి గురై, తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు విడుస్తున్నారు.

AlsoRead RTC Strike : మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు...

ఇప్పటికే పలువురు కార్మికులు ప్రాణాలు పోగా.. తాజాగా మరో కార్మికుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీసీ కార్మికుడు నగేష్ మృతి చెందాడు. నారాయణఖేడ్ డిపోలో నగేష్‌ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. నవంబర్‌ 5న కేసీఆర్‌ డెడ్‌లైన్‌ వార్త విని నగేష్ అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రెండు రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణం పొందాడు. మహబూబాబాద్ కు చెందిన నరేష్ అనే డ్రైవర్ బుధవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.

గత 36 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. నరేష్ 2007లో ఆర్టీసీలో ఉద్యోగిగా చేరాడు. ఆర్టీసీ సమ్మెలో చురుగ్గా పాల్గొన్న నరేష్ చివరికి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నరేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హైదరాబాదులోని రాణిగంజ్ లో మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ బాబా ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. డబీర్ పురాలో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.