హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి వచ్చేలా కనబడుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన ఆర్టీసీ సమ్మెకు ఒక ముగింపు పలకాలని అటు ప్రభుత్వం ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

మెుత్తానికి సమ్మె పరిష్కారాన్ని టీఆర్ఎస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటరీ నేత కె.కేశవరావు చేతుల్లో పెట్టేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పరిష్కారాన్ని చూడాలంటూ కేకేకు కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే కేకేకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజారవాణా వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని వాటిని పరిష్కరించి ఓ కొలిక్కి తీసుకురావాల్సిందిగా కేసీఆర్ కోరినట్లు సమాచారం. 

కేసీఆర్ ఫోన్ చేయడంతో ఢిల్లీలో ఉన్న కేకే హైదరాబాద్ బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాలు, విపక్షాలతో భేటీ  కానున్నట్లు సమాచారం. 

ఇకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలు సైతం కేకే రాయబారంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కేకే ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించారు. సమ్మె విడనాడాలని చర్చలకు రావాలంటూ కేకే ఒక ప్రకటన విడుదల చేశారు.

కేకే ప్రకటనను సానుకూలంగా స్వాగతిస్తున్నారు. కేకే మాటను గౌరవించి తాము చర్చలకు హాజరువుతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అయితే సమ్మె విరమించి చర్చలకు రామని సమ్మె కొనసాగిస్తూనే చర్చలకు వస్తామని తెలిపారు. 

అంతేకాదు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనంపై ఎలాంటి హామీ పొందుపరచకపోయినప్పటికీ నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

మెుత్తానికి కేకే రాయబారం ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి మార్గం సుగమం కాబోతుందని తెలుస్తోంది. సాయంత్రం లేదా రేపు ఉదయానికి సమ్మె ఓ కొలిక్కి రావొచ్చని తెలుస్తోంది. ఒక వేళ సమ్మె విరమిస్తే అది కేకే క్రెడిట్ అవుతుందనే చెప్పాలి.