హైదరాబాద్: తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఇక్కట్లను కొంతలో కొంతమేరైనా తగ్గించేందుకు ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలను నడిపించడం, తాత్కాలిక కండక్టర్లను నియమించడం తదితర చర్యలను చేపట్టింది. 

ఈ చర్యలవల్ల ప్రజలకు ఒకింతమేర సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఒక కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఈ తాత్కాలిక కండక్టర్లు ప్రజలకు టిక్కెట్లు ఇవ్వవలిసిన అవసరం లేకుండా నేరుగా ఛార్జ్ వసూలు చేయవలిసిందిగా అధికారులు వీరికి సూచించారు. 

ఇలా నేరుగా ఛార్జ్ వసూలు చేస్తుండడంతో అధిక చార్జీలు వసూలుచేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. టిక్కెట్లు జారీ చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఎంతమంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారో లెక్క కూడా దొరక్క అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 

వీటన్నిటికీ చరమగీతం పాడేందుకు ఆర్టీసీ అధికారులు డిసైడ్ అయ్యారు. తాత్కాలికంగా నియమించుకున్న సిబ్బందిని కూడా టిక్కెట్లు జారీ చేయమని చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు ఫిక్స్ అయ్యారు.

ప్రస్తుతం అధిక శాతం టిక్కెట్లను జారీ చేసేందుకు టిమ్స్ యంత్రాలను వాడుతున్నారు. తాత్కాలిక సిబ్బందికి వీటిపైన ఇంకా అవగాహన కల్పించలేదు కాబట్టి గతంలో ఇచ్చే ముద్రించిన టిక్కెట్లనే జారీ చేయమని చెప్పారు. కొన్ని రోజులు గడిచాక టిమ్స్ యంత్రాలపైన అవగాహన కల్పించిన తరువాత వారికి ఈ యంత్రాలను అప్పగించనున్నట్టు సమాచారం.