హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవసరం లేదని తాము చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు.

 ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈడీ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల) కమిటీపై బుధవారం నాడు ఆశ్వత్థామ రెడ్డి స్పందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ విషయమై ఆర్టీసీ జేఎసీ నేతలే వెనక్కు తగ్గారని సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామ రెడ్డి స్పందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీకి చట్టబద్దత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈడీల కమిటీ ఎవరితో ముందుగా చర్చిస్తోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఈడీల కమిటీ కంటితుడుపు చర్య మాత్రమేనని ఆశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కమిటీతో కాలయాపన చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  ఆయన ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు.  ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని కూడ ప్రకటించారు. కానీ, ప్రభుత్వం నుండి మంగళవారం నాటి వరకు కూడ చర్చల విషయమై సానుకూలంగా స్పందించలేదు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె , కార్మికుల డిమాండ్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సీఎం కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై అధ్యయనం చేయనుంది. 

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌పై ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గారని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పారు.ఈ వ్యాఖ్యలపై ఆశ్వత్థామరెడ్డి తీవ్రంగా స్పందించారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని ఆయన గుర్తు  చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడ మద్దతుగా నిలిచాయి.

ఈ నెల 21 వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను ఆర్టీసీ జేఎసీ పిలుపునిచ్చింది.ఆర్టీసీ కార్మికులు ఈ నె 30వ తేదీన సకల జనుల సమరభేరిని నిర్వహించనున్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టులో ఈ నెల 28వ తేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టుకు ప్రభుత్వం ఏం చెప్పనుందోననేది కీలకంగా మారింది.