హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కార్మిక నాయకులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రతినిధులు శనివారం చర్చలు జరపనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరుగుతాయి. ఈ మేరకు ఆర్టీసీ జేఎసి నేతలు అశ్వత్థామ రెడ్డికి, రాజిరెడ్డి, తదితరులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. 

ప్రభుత్వం ఆర్టీసీ విలీనం డిమాండును మినహాయించి ఆర్థిక భారం పడని డిమాండ్లపై చర్చలు జరపాల్సిందిగా కేసీఆర్ శుక్రవారం రాత్రి ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మను, తదితరులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కార్మిక నేతలతో చర్చలు జరగనున్నాయి. 

Also Read: RTC Strike: దిగొచ్చిన కేసీఆర్, చర్చలకు కేసీఆర్ సై.

తమ డిమాండ్ల విషయంలో పట్టు వీడేది లేదని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అంటున్నారు. తాము ప్రభుత్వం ముందు పెట్టిన 26 డిమాండ్లపై కూడా చర్చలు జరగాల్సిందేనని ఆయన అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తమ డిమాండును వదులుకునేది లేదని ఆయన అన్నారు.  చర్చల తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీన తమ సమ్మెను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ కేసీఆర్ చేసిన ప్రకటన తర్వాత కూడా సమ్మె కొనసాగింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కూడా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు మరో ఆఫర్ ఇచ్చారు. 

Also Read: RTC Strike: వేడెక్కిన ఉస్మానియా.. టీఆర్ఎస్‌వీ విద్యార్ధులను అడ్డుకున్న ఓయూ జేఏసీ

సమ్మెలో ఉన్న కార్మికులు దరఖాస్తు పెట్టుకుని తిరిగి విధుల్లో చేరవచ్చునని ఆయన చెప్పారు. దానికి కూడా కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ స్థితిలో కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం సాయంత్రం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక నేతలతో చర్చలు జరపాలని సమీక్షానంతరం ఆదేశించారు.