హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిగి వచ్చినట్లు కనిపిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మిక సంఘాలతో చర్చకు కేసీఆర్ అనుమతి ఇచ్చారు. విలీనం మినహా మిగతా 21 డిమాండ్లపై చర్చించాలని ఆయన ఆర్టీసీ ఇంచార్జీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను ఆదేశించారు.

శనివారం ఉదయం 11 గంటలకు బస్ భవన్ లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ శుక్రవారం దాదాపు నాలుగు గంటల పాటు ప్రగతిభవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మమ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఆయన చర్చించారు. సుదీర్ఘ చర్చ తర్వాత కార్మిక సంఘాల నేతలతో చర్చలకు కేసీఆర్ అనుమతించినట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీ సమస్యలపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీల కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యయనం చేసి సమర్పించిన నివేదికను సంస్థ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మకు శుక్రవారం ఉదయం సమర్పించింది. దాన్ని ఆయన అజయ్ కు అందించారు. అజయ్ దాన్ని కేసీఆర్ కు అందించారు. ఈ స్థితిలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.. 

ఈడీల కమిటీ నివేదిక, హైకోర్టు ఆదేశాలపై కేసీఆర్ చర్చించారు. ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారం పడని అంశాలపై కార్మిక సంఘాలతో చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే, కార్మిక సంఘాల నేతలకు చర్చల కోసం పిలుపు శుక్రవారం రాత్రి అందలేదని సమాచారం. శనివారం ఉదయం పిలుపు అందవచ్చునని సమాచారం. కేసీఆర్ కార్మిక సంఘాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అశ్వత్థామ రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.