హైదరాబాద్: ఎల్లుండి నుండి తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక  నిరహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. చలో ట్యాంక్‌బండ్‌ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, పలు పార్టీల నేతలపై దాడులను ఆర్టీసీ జేఎసీ నేతలు తీవ్రంగా ఖండించారు.

ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  తీసుకొన్న నిర్ణయాలను ఆశ్వత్థామరెడ్డి మీడియాకు వివరించారు.

also read:RTC Strike:'చట్టబద్దత లేదా, ఆ తర్వాతే సుప్రీంకు'

ఈ నెల 12వ తేదీన  తనతో పాటు ఆర్టీసీ జేఎసీ కో కన్వీనర్ రాజిరెడ్డితో పాటు మరో ఇద్దరు జేఎసీ నేతలు కూడ  నిరవధిక దీక్షకు దిగుతున్నట్టుగా చెప్పారు.చలో ట్యాంక్ బండ్‌ కార్యక్రమంలో అత్యంత ధైర్యవంతంగా పాల్గొన్న ఆర్టీసీకి చెందిన మహిళ ఉద్యోగినులను ఆశ్వత్థామరెడ్డి అభినందించారు.

చలో ట్యాంక్‌బండ్‌లో ఆర్టీసీ కార్మికులపై జరిగిన లాఠీచార్జీని ఆశ్వత్థామరెడ్డి ఖండించారు. ఈ దమనకాండను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఇళ్ల  ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆశ్వత్థామ రెడ్డి చెప్పారు.

ఈ నెల 13 వతేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఆర్టీసీ సమ్మె సమయంలో తమపై చోటు చేసుకొన్న  దమనకాండకు సంబంధించి ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు.ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్‌లను నిర్వహించనున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. 

చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో మెజార్టీ ఆర్టీసీ కార్మికులు, పలు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని ఆర్టీసీ ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. అయితే చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు చేరారని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రకటించడాన్ని ఆశ్వత్థామరెడ్డి ఖండించారు.

మావోయిస్టులు ఆర్టీసీ ఉద్యమంలో చేరారనే పేరుతో ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా తమతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సమ్మె విషయమై ఈ నెల 11వ తేదీన హైకోర్టు కీలక విచారణ చేయనుంది.ఆర్టీసీ భవిష్యత్తుపై హైకోర్టు ఈ విచారణ సందర్భంగా ఏ రకమైన ఆదేశాలు ఇవ్వనుందో అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఈ నెల 7వ తేదీన హైకోర్టులో విచారణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన  నివేదికలపై తెలంగాణ హైకోర్టు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై శనివారం నాడు తెలంగాణ సీఎం  కేసీఆర్  సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన హైకోర్టు నిర్ణయం తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.