హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఈ నెల 11వ తేదీన హైకోర్టు చెప్పే తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారుల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం  తీసుకొన్నారు.

శనివారం నాడు ఆర్టీసీ సమ్మెపై ఈ నెల 11వ తేదీన హైకోర్టు తీర్పు చెప్పనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనే దానిపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

also read:ఆర్టీసి ''చలో ట్యాంక్‌బండ్'' లో మావోయిస్టులు..: పోలీస్ కమీషనర్ సంచలన వ్యాఖ్యలు...

ఆర్టీసీ సమ్మెపై ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టు ఏ రకమైన వ్యాఖ్యలు చేసిందనే విషయమై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపాం, తనను కాదని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు, సమ్మె నివారించేందుకు చేయాల్సిందంతా చేశామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

హైకోర్టుకు అన్ని లెక్కలు చెప్పినా కూడ తప్పుడు లెక్కలే అంటూ కోర్టు వ్యాఖ్యానించడం, ఆర్టీసీకి చట్టబద్దత లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చేసేదేముందని కేసీఆర్ అన్నారు.

ఆర్టీసీకి చట్టబద్దత లేదని , ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకోవద్దని ఈ నెల 7వ తేదీన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.ఈ నెల 11వ తేదీలోపుగా ఇరువర్గాలు మెట్టుదిగాలని హైకోర్టు సూచించింది.సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆదేశించింది. లేకపోతే ఈ నెల 11న తామే ఓ నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ నెల 7వ తేదీన హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం, జీహెచ్ఎంసీ సమర్పించిన లెక్కలన్నీ కూడ తప్పుడు లెక్కలంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కూడ ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టుకు ఐఎఎస్ అధికారులు హాజరై వివరణ ఇచ్చినా కూడ హైకోర్టు తప్పుడు లెక్కలంటూ చెప్పడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి చట్టబద్దత లేదని చెప్పడం తనకు విస్మయం కల్గిస్తోందన్నారు. చట్టబద్దత లేకపోతే ఆర్టీసీ సంస్థ ఇంతకాలం ఎలా నడుస్తోందని ఆయన ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సమస్య పరిష్కారం కోసం ఈడీల కమిటీని ఏర్పాటు చేసి చర్చలకు తాము సుముఖమని ప్రకటించినా కూడ ఆర్టీసీ జేఎసీ నేతలు చర్చలకు సానుకూలంగా లేని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

ఈ నెల 11వ తేదీన హైకోర్టు ఆర్టీసీ సమ్మె విషయంలో ఏం చెబుతోందో చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమీక్ష సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం.