వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు బస్సు బ్రేక్ ఫేయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు బస్సు బ్రేక్ ఫేయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి వికారాబాద్‌కు వస్తున్న అనంతగిరి గుట్ట సమీపంలో బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఈ ప్రమాదంలో 10 మంది వరకు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ జిల్లాలోని ముద్దనూరు బైపాస్ రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. దంపతులతో పాటు ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను దస్తగిరి, సరస్వతి, ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
