నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి 37 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ప్రమాదానికి గురైంది.

కంటైనర్‌ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడ అంతా బురదగా ఉండటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.