ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయి 13మంది ప్రయాణికులు గాయపడటంతో పాటు గేదె మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్: కామారెడ్డి నుండి భద్రాచలంకు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రమాదానికి (RTC Bus Accident) గురయ్యింది. బస్సు మంచి వేగంలో వుండగా ఒక్కసారిగా గేదె అడ్డురావడంతో అదుపుతప్పి రోడ్డుకిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టిసి బస్సు ప్రయాణికులతో భయలుదేరింది. అయితే మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారువద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బస్పు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. రహదారిపై వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా గేదె అడ్డువచ్చింది. దీంతో డ్రైవర్ గేదెను తప్పించబోయిన సాధ్యంకాక దాన్ని ఢీకొట్టిన బస్సు అమాంతం రోడ్డుకిందకు దూసుకెళ్లింది. ఓ చివరకు ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో బస్సులోని 13మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. గాయపడినవారందరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ బస్సుకు అడ్డొచ్చిన గేదె చనిపోయింది. అలాగే చెట్టును ఢీకొట్టడంతో ఆర్టిసి బస్సు ముందుబాగం నుజ్జునుజ్జయ్యింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపై పడివున్న గేదె మృతదేహాన్ని తరలించారు.
ఇదిలావుంటే చిత్తూరు జిల్లాలో గత శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి సమీపంలో భాకరాపేట (bhakarapet bus accident) ఘాట్ రోడ్డులో నిశ్చితార్థ బృందంతో వెళుతున్న ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో పెళ్లికొడుకుతో పాటు 52మంది బంధువులు, స్నేహితులు బస్సులో వున్నారు. వీరిలో ఇప్పటివరకు 9మంది చనిపోగా మిగతావారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా మరికొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఈ క్రమంలోనే గత ఆదివారం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేయగా శనివారం రాత్రే వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఓ ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు బయలుదేరారు.
అయితే వీరు ప్రయాణిస్తున్న బస్సు చిత్తూరు జిల్లాలో భాకరావుపేట ఘాట్ రోడ్డుపై వెళుతుండగా దొనకోటి గంగమ్మ దేవాలయం సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు.
బస్సు లోయలో పడిన చాలాసేపటి తర్వాత క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నప్పటికి చిమ్మచీకటి కమ్ముకుని వుండటం, లోయలోకి దిగడానికి సాధ్యంకాకపోవడంతో సహాయకచర్యలకు మరికొంత ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది లోయలోకి దిగి క్షతగాత్రులను కాపాడారు. కానీ అప్పటికే కొందరు మరణించారు.
