ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం ఏర్పడటంపై ఆర్ఎస్ఎస్ మండిపడింది. ఆ ఘటనను ఖండించింది. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నదని పేర్కొంది. హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 5వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఇక్కడ సమావేశాలు జరిగాయి.
హైదరాబాద్: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి భద్రతా లోపం(Security Lapse) ఏర్పడటంపై ఆర్ఎస్ఎస్(RSS) మండిపడింది. ఇది చాలా తీవ్రమైన విషయం అని పేర్కొంది. ఇది దేశానికి మంచిది కాదని పేర్కొంది. ఈ ఘటనను ఖండించింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నదని వివరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశాలు(Coordination Meeting) ముగిశాయి. హైదరాబాద్ శివారులోని అన్నోజిగూడాలో ఈ నెల 5వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఇందులో సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహనర్ భాగవత్, సర్ర కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతోపాటు ఐదుగురు సహ సర్ కార్యవాహలు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో 36 సంస్థలకు చెందిన 216 మంది పాల్గొన్నారు. ఈ సమావేశాలనంతరం ఈ రోజు సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య విలేకరులతో మాట్లాడుతూ పంజాబ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భద్రతా లోపం ఏర్పడటంపై స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయం అని అన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నదని వివరించారు. ఇలాంటి ఘటనలు దేశానికి అంత మంచిది కావని చెప్పారు. ఈ సమావేశాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోరని, సభ్యులు తమ అనుభవాలు, భవిష్య ప్రణాళికలను పంచుకుంటారని వివరించారు.
స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరుగున పడిన 250 మంది స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను వెలికి తీయడం గొప్ప విషయం అని, ఇందులో సమాజంలోని వివిధ వర్గాలతోపాటు ఎస్సీ, ఎస్టీలవారు ఉన్నారని చెప్పారు. సంస్కార భారతి వీటిని నాటకాల రూపంలో ప్రచారం చేయనుందని తెలిపారు. కొవిడ్ మూలంగా శాఖ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకున్నట్టు వివరించారు. యువతలో సంఘ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతున్నదని, 2012-21 కాలంలో సంవత్సరానికి లక్షకుపైగా యువత సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 వేల శాఖలు జరుగుతున్నాయని తెలిపారు.
జాతీయ విద్యా విధానం భారతీయ చరిత్ర ఆధ్యాత్మికతను ప్రతిబింబించేట్లు ఉండాలని డాక్టర్ మన్మోహన్ వైద్య విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ పేర్కొన్నారు. ఒకే విద్యా విధానం అనేది రాష్ట్రాల భిన్నత్వానికి ఏమాత్రం ఆటంకం కాదని తెలిపారు. వైవిద్యం అంటే విభేదాలు కావని, జాతి ఏకతకు అంతస్సూత్రమైన అంశాలకు అనుగుణంగా ఈ విధానాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. కుల వివక్షకు రూపుమాపి సమాజంలో సద్భావన పెంపొందించడానికి సామాజిక సామరస్యత అవసరమని, ఇందుకోసం సంఘ్ కృషి చేస్తున్నదని తెలిపారు. సమాజ జాగరణ అనేది సంఘ్ ప్రధాన లక్ష్యమని, జాగరూక సమాజం ప్రభుత్వ విధానాలను ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) తన పంజాబ్ పర్యటన(Punjab Visit) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు రోడ్డు మార్గాన వెళ్లుతుండగా రైతులు ఆందోళన చేయడం.. సుమారు 20 నిమిషాలు ప్రధాన మంత్రి ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. భద్రతా లోపం(Security Breach) ఏర్పడ్డ కారణంగా ఆయన అక్కడి నుంచి భటిండాకే వెనుదిరిగి వెళ్లిపోయారు. భటిండా దాకా ప్రాణాలతో చేరగలిగానని, సీఎంకు థాంక్స్ చెప్పాలని ప్రధాని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
