Hyderabad: పెట్టుబడుల పేరుతో వేలాది మందిని మోసం చేసి రూ.903 కోట్లను కాజేసినందుకు గాను చైనా, తైవాన్ పౌరులతో పాటు మొత్తం పది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.91 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
Investment Fraud Racket: తైవాన్, చైనా జాతీయులతో పాటు పలువురు కలిసి 900 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ ను హైదరాబాద్ పోలీసులు బుధవారం ఛేదించారు. అధిక లాభాలను సాకుగా చూపి లక్షలాది మందిని మోసం చేసి రూ. 903 కోట్ల మేర మోసగించిన స్కామ్‌లో తైవాన్ జాతీయుడు, చైనా జాతీయుడు సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెల్తే.. పెట్టుబడుల పేరుతో దాదాపు రూ.903 కోట్ల మోసం జరిగినట్లు హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్రాడ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు చైనా పౌరులు సహా 10 మందిని అరెస్టు చేశారు. రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసానికి గురైన ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం హవాలా మోసం వెలుగులోకి వచ్చింది. లోక్సమ్ అనే ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లో రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసానికి గురైన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో విచారణలో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫిర్యాదుదారుడి డబ్బు జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు తేలింది.
హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. ఇది భారీ మొత్తంలో జరిగిన ఫ్రాడ్ గా పేర్కొన్నారు. విదేశీ మారకపు లావాదేవీలకు లైసెన్స్ పొందిన నగదు మార్పిడిదారులు ఈ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. విదేశాలకు వెళ్లే వారికి విదేశీ మారకద్రవ్యం ఇచ్చేలా లైసెన్స్ ఇచ్చారు. కానీ వారు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించారు. అక్రమంగా హవాలా లావాదేవీలు నడిపారని తెలిపారు. నిందితులు కాల్ సెంటర్ల నుంచి పెట్టుబడిదారులకు కమీషన్ ఇస్తూ వందలాది మంది బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకుంటున్నారు.
ఢిల్లీ, ముంబై నుంచి హవాలా రాకెట్లు నడుపుతున్న చైనా జాతీయుడు లెక్ అలియాస్ లీ జాంగ్‌జున్, తైవాన్‌కు చెందిన చు చున్-యులను అరెస్టు చేశారు. అరెస్టయిన ఇతర నిందితుల్లో సాహిల్ బజాజ్, సన్నీ అలియాస్ పంకజ్, వీరేంద్ర సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్ కౌశిక్, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీమ్ బేగ్ లు ఉన్నారు. కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన కౌశిక్ అనే వ్యక్తి గత సంవత్సరం ఆర్బీఐ నుండి రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు మనీ ఎక్స్ఛేంజీల కోసం లైసెన్స్ తీసుకున్నాడు.
ఏడు నెలల కాలంలో రంజన్ మనీ కార్ప్ ఖాతాలో రూ.441 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. కాగా, కేడీఎస్ ఫారెక్స్ ద్వారా రూ.462 కోట్ల లావాదేవీ జరిగింది. హవాలా ద్వారా రూ.903 కోట్ల మోసం జరిగిందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పూణెకు చెందిన వీరేంద్ర సింగ్‌ను అరెస్టు చేయగా, చైనాకు చెందిన జాక్ ఆదేశాల మేరకు జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్యాంక్ ఖాతా పాస్‌వర్డ్‌ను ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు.
పోలీసుల దర్యాప్తులో బీటెక్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల బ్యాంకు ఖాతాల్లో ఒకే ఫోన్ నంబర్ ఉన్నట్లు తేలింది. లెక్ అలియాస్ లీ ఝంజౌ సూచనల మేరకు ఢిల్లీకి చెందిన సంజయ్ యాదవ్ బెట్‌నెచ్ ఖాతాను తెరిచాడు. అదేవిధంగా మరో 15 బ్యాంకు ఖాతాలను తెరిచి ముంబైలో తాత్కాలికంగా నివసిస్తున్న తైవాన్‌కు చెందిన చు చున్-యుకు ఇచ్చాడు. మంగళవారం అతడిని ముంబైలో అరెస్టు చేశారు. ఖాతా వివరాలు, యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇతర దేశాలకు పంపుతున్నాడని పోలీసులు గుర్తించారు.
సంజయ్ యాదవ్, వీరేంద్ర రాథోడ్ ఒక్కో ఖాతాకు రూ.1.2 లక్షల కమీషన్ పొందేవారు. జిందాయ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుండి 38 ఇతర బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. జిందాయ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 38 ఖాతాల నుంచి రంజన్ మనీ కార్పొరేషన్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయింది. ఖాతాలో దొరికిన డబ్బును అంతర్జాతీయ పర్యటనల పేరుతో నడుపుతున్న ఫారెక్స్ ఎక్స్చేంజ్ కు పంపుతున్నట్టు గుర్తించారు.
