హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగడంతో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు సాగుతున్నాయి. వారం రోజులుగా సుమారు రూ. 700 కోట్ల మేరకు మద్యం విక్రయాలు సాగినట్టుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

గత నెల 28వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ పెట్టే యోచన చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పెట్టే విషయమై చర్చించనున్నట్టుగా సీఎం  తెలిపారు.

also read:మందుబాబులకు గుడ్‌న్యూస్: నేటి నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు వైన్స్ షాపులు

ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఐదో  విడత లాక్ విడతలో భాగంగా పలు అంశాలపై లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇచ్చింది కేంద్రం.

అయితే హైద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి అవసరమైతే మళ్లీ లాక్ డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ నుండి 
సూచనలు వచ్చాయి. ఈ విషయమై ప్రభుత్వం చర్చిస్తోంది. లాక్ డౌన్ విధిస్తే లాభనష్టాలపై ప్రభుత్వం చర్చిస్తోంది.

అయితే మళ్లీ లాక్ డౌన్ విధిస్తే మద్యం అందుబాటులో ఉండదనే ఉద్దేశ్యంతో భారీగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. జూన్ మాసంలో రాష్ట్రంలో రూ.2389 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి. 

లాక్ డౌన్ విధించే యోచన ఉందని కేసీఆర్ ప్రకటించిన  తర్వాత పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు సాగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. జూన్ 29వ తేదీన రూ. 185 కోట్ల 85 లక్షలు, గత నెల 30వ తేదీన రూ. 160 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

గత వారం రోజులుగా రాష్ట్రంలో రూ. 700 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర మద్యం విక్రయాలు చోటు చేసుకొంటున్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరగలేదు.

మళ్లీ లాక్ డౌన్ విధిస్తే మద్యం దొరుకుతోందో దొరకదోననే ఉద్దశ్యంతో ముందు జాగ్రత్తగా మందును కొనుగోలు చేసి నిల్వ చేసుకొంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున మద్యం డిపోల నుండి విక్రయాలు చోటు చేసుకొంటున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.