Asianet News TeluguAsianet News Telugu

రూ. 5 కోట్ల విలువ: 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ బుక్ ఆవిష్కరణ'


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకాన్ని పాలమూరు వాసి  రచించాడు.ఈ పుస్తకావిష్కరణ నిన్న జరిగింది. 

 Rs 5 crore book An Invaluable Invocation spreads world peace and harmony lns
Author
First Published Feb 12, 2024, 7:44 PM IST | Last Updated Feb 12, 2024, 7:46 PM IST


హైదరాబాద్: విశ్వశాంతిని కోరే విశ్వగీతం "" పుస్తకావిష్కరణ ఆదివారంనాడు మహాబూబ్‌నగర్ లో జరిగింది.   ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం డా. వంగీపురం శ్రీనాథాచారి రచించిన "ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్" పుస్తకం వెల ఐదు కోట్లు.  ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత, లిమ్కా, గిన్నిస్ వరల్డ్ రికార్డుల గ్రహీత, అనువాద రచయిత, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి రచించిన " ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ " పుస్తకాన్ని ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వశాంతిని కోరి శ్రీనాథాచారి రచించిన ఈ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధి పొందాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలను తన పుస్తకంలో ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయమన్నారు. ఇప్పటికే అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్న శ్రీనాథాచారి రచించిన ఈ పుస్తకం గిన్నిస్ రికార్డ్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రముఖ ఆకాశవాణి రీడర్ డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు పుస్తక సమీక్ష చేస్తూ ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి గొప్ప పుస్తకం రాలేదన్నారు. ఈ పుస్తకాన్ని పది విభాగాలుగా రచించారన్నారు. విశ్వశాంతిని కోరి రచించిన ఈ పుస్తకం ప్రపంచంలో పెద్ద పెద్ద రికార్డులు సాధిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ విద్యావేత్త కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు చెందిన వంగీపురం శ్రీనాథాచారి ప్రపంచస్థాయి పుస్తకాన్ని రచించడం జిల్లాకు గర్వకారణమన్నారు. 

పుస్తక రచయిత డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల అనుభవంతో, మూడు సంవత్సరాల కఠోర దీక్షతో ఈ పుస్తకాన్ని రచించానన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను ఇందులో ఆవిష్కరించానన్నారు. ఏ దేశంలోనైనా సమస్యలన్నీ ఒకటేనని వాటిని పరిష్కరించబడాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రచించానన్నారు. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అత్యంత సుధీర్ఘమైన సంబోధనాత్మక భావగీతంగా ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ పుస్తకం అమ్మగా వచ్చిన డబ్బులో మొత్తం ఐక్యరాజ్య సమితి వారికి యాభై శాతం, భారతదేశానికి ఇరవైఐదు శాతం‌ , తెలంగాణ ప్రభుత్వానికి ఇరవైఐదు శాతం‌ చెల్లిస్తానన్నారు. ఇందులో ప్రపంచంలోని 197 దేశాలలోని సమస్యలను 237 కవితలలో ఆవిష్కరించానన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకమిదని, త్వరలోనే అందరికీ అందుబాటులో తెస్తానన్నారు. 

కార్యక్రమ సమన్వయకులు, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  మాట్లాడుతూ వంగీపురం శ్రీనాథాచారి రచించిన ఈ పుస్తకానికి అనేక అంతర్జాతీయ అవార్డులు వస్తాయని, పాలమూరు కీర్తిపతాక ప్రపంచ స్థాయిలో రెపరెపలాడుతుందన్నారు. అనంతరం  వంగీపురం శ్రీనాథాచారిని మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళ సాహిత్య, సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు రావూరి వనజ, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్,  మాజీ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.  విజయకుమార్, సీనియర్ సిటిజన్ ఫోరమ్ అధ్యక్షులు జగపతిరావులతో పాటు జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios