అవినీతి కేసులో అరెస్టైన సీఐ జగదీష్ కు చెందిన లాకర్ లో కళ్లు తిరిగే స్థాయిలో భారీ నగదు, బంగారం దొరికింది. నిజామాబాద్ లోని ఓ బ్యాంకులో జగదీష్ కు చెందిన లాకర్ ను కుటుంబసభ్యుల సమక్షంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తెరిచారు. దీంట్లో రూ. 34, 40, 200 నగదు. తొమ్మిది లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 15.7 గ్రాముల వెండి, ఇంకా వేరే ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. 

ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కేవలం రూ.60 మాత్రమే దొరికాయి. అయితే లాకర్ లో దీనికి విరుద్ధంగా భారీ నగదు దొరకడంతో అధికారులు షాక్ అయ్యారు. అకౌంట్ లో వేయకుండా, లాకర్ లో ఎందుకు పెట్టుకున్నాడన్న దాని మీద అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జిల్లాలోనే ఓ సిఐ దగ్గర ఇంత పెద్ద మొత్తం లభించడం మొదటిసారి. 

స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఐదులక్షల రూపాయలు లంచం అడిగి సీఐ జగదీష్ పట్టుబడిన విషయం తెలిసిందే. బెట్టింగ్ కేసు విచారణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఇవి బయటపడ్డాయి.