పనిమనుషులు, డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కితే ఫైన్ కట్టాల్సిందేనని హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌‌మెంట్‌లో బోర్డు ఏర్పాటు చేశారు. అయితే దీనిని సోషల్ మీడియా వేదికగా మెజారిటీ నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  

భారత్‌తో పాటుగా, ప్రపంచంలోని చాలా దేశాల్లో వివక్ష అనేది కొత్తేమి కాదు. ముఖ్యంగా ఇంటి పని చేసేవారు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వీపర్స్.. అవమాన భారాన్ని భరించిన ఘటనల కొన్నేళ్ల క్రితం ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా అలాంటి ఘటనలు కొన్ని మళ్లీ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల వారిపై వివక్ష మళ్లీ దర్శనమిస్తుంది. హైదరాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ తాజా ఉదాహరణగా నిలిచింది. ఆ హౌసింగ్ సోసైటీలో.. పని మనుషులు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ మెయిన్ లిఫ్ట్ ఎక్కితే జరిమానా విధిస్తున్నారు. ఇందుకు సంబంధించి బహిరంగంగానే ఓ నోటీసు కూడా అంటించారు. 

ఓ లిఫ్ట్ వద్ద ఉన్న నోటీసులో.. ఇళ్లలో పని చేసేవాళ్లు, డ్రైవర్లు, డెలివరి బాయ్స్‌ ఈ లిఫ్ట్ వినియోగిస్తే రూ. 300 జరిమానా విధించనున్నట్టుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను Harsha Vadlamani అనే ఇండిపెండెంట్ ఫొటో జర్నలిస్టు ట్విట్టర్‌‌లో పోస్టు చేశారు. 2022లో సైబరాబాద్ ఇలా ఉందనే అర్థం వచ్చేలా Cyberabad, 2022 అని పేర్కొన్నారు. 

ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాటి మనుషుల పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మన ఇంటి పనులు చేసేవారిపై, మనం బయటకు వెళ్లేటప్పుడు కారులో తీసుకెళ్లేవారిపై, మనం ఆర్డర్ చేస్తే ఫుడ్ తెచ్చేవారిపై ఇలాంటి వివక్ష ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

‘అయ్యో!! వారు మీ ఇళ్లలోకి వచ్చి మీరు వంటలు చేసే పాత్రలు, మీరు ధరించే బట్టలు శభ్రం చేయడానికి ముట్టుకోవచ్చు. డెలివరీ బాయ్స్ మీరు తినే ఆహారాన్ని తీసుకురావచ్చు.. డ్రైవర్లు కారులో మీ పక్కన కూర్చోవచ్చు.. కానీ వారు "మెయిన్" లిఫ్ట్‌లోకి వెళ్లలేరు? మెడికల్ మాస్క్‌తో ముఖానికి మాస్క్ చేయండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

అయితే కొందరు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తున్నారు. కరోనా వైరస్‌ భయం కారణంగా అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని.. అందుకే కొన్ని అపార్ట్‌మెంట్స్‌లో ఇంట్లో పని చేసేవాళ్లు, డ్రైవర్ల కోసం సర్వీసు లిఫ్ట్ అందుబాటులో ఉంచుతున్నారని చెప్పుకొస్తున్నారు.