Asianet News TeluguAsianet News Telugu

న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో ట్విస్ట్... మర్డర్ కు భారీ స్కెచ్, రూ. 10 లక్షల సుపారీ..

వరంగల్ లో న్యాయవాది మల్లారెడ్డి దారుణ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన హత్యకు పది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. పక్కా స్కెచ్ తో రెక్కీ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. 

rs 10 lakhs supari for advocate malla reddy murder says police, warangal
Author
Hyderabad, First Published Aug 3, 2022, 12:40 PM IST

వరంగల్ : న్యాయవాది మూల గుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకు పైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చింది ఎవరు? మల్లారెడ్డిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? ఆయనను మట్టి పెడితే ఎవరికి మేలు? ఈ హత్యకు కారణం మైనింగ్ వివాదమా? భూ వివాదాలా? హత్య ప్రణాళిక రచించింది ఎవరు? ఘటనలో పాల్గొన్నది ఎవరు?  సోమవారం రాత్రి ములుగు జిల్లా పందికుంట సమీపంలోహత్యకు గురైన మూల గుండ్ల మల్లారెడ్డి ఘటనపై సర్వత్రా సాగుతున్న చర్చ ఇది. మల్లంపల్లి మాజీ సర్పంచ్ రవి సహా పదిమందికి పైగా విచారించి వదిలేసిన పోలీసులు కీలక వ్యక్తులపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

పక్కా స్కెచ్ తో..
మల్లారెడ్డి మర్డర్ పై మంగళవారం రాత్రి వరకు స్పష్టత రాకపోగా భిన్న కథనాలు వినిపించాయి. ఎర్రమట్టి క్వారీలు, భూవివాదాల పరిష్కారం కోసం సోమవారం కూడా ములుగు రెవెన్యూ, పోలీసు అధికారులను కలిసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ హత్య జరిగే నాలుగు రోజుల ముందు మల్లారెడ్డి ఇద్దరితో తీవ్రస్థాయిలో గొడవపడినట్లు చెబుతున్నారు. తహసిల్దార్ కార్యాలయం సమీపంలో ఒకరితో జరిగిన గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో అవతలి వ్యక్తి మల్లారెడ్డిని లేపేస్తానని హెచ్చరించాడు అని అంటున్నారు. 

ములుగు జిల్లా : ఇన్నోవాతో ఢీకొట్టి..కత్తులతో పొడిచి లాయర్ దారుణహత్య

మల్లారెడ్డి హత్యకు హైదరాబాద్ లోని ఒక హోటల్లో పథకానికి రూపకల్పన జరిగినట్లు ములుగు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. హంతకులకు పది లక్షల రూపాయలకు పైగానే సుపారీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. హంతకులు కూడా హైదరాబాద్కు చెందిన వారుగా భావిస్తుండగా హత్య జరిగిన సమయంలో హంతకులు మాస్కులు ధరించి, తెలుగు మాట్లాడారని చెబుతున్నారు. హత్యకు వాడిన కత్తులు, మారణాయుధాలను చూస్తే హైదరాబాద్ నుంచి గానీ... ఆన్లైన్ లో గానీ తెప్పించినట్టుగా ఉన్నాయ్ అన్న చర్చ జరుగుతోంది.

ఆ ఇద్దరూ ఎవరు?
మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పేర్లు చెప్పకుండా హత్య వెనుక ఇద్దరు హస్తముందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలతో పాటు పలు చోట్ల  భూ వివాదాల్లో ఆయనను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదులో హత్యకు వ్యూహరచన చేసి మూడు రోజులు ముందు హనుమకొండలో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. చివరకు పందికుంట వద్ద పథకం అమలు చేసినట్లు తెలిసింది.  కాగా,  హత్య వెనుక ఆ ఇద్దరు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

బుధవారం దీనిమీద గుట్టు విప్పే అవకాశం ఉంది. ములుగు మండలం ఉమ్మాయినగర్, కెఎస్ ఆర్ కాలేజీ సమీపంలోని ఐదుగురు యజమానులను మంగళవారం వేర్వేరుగా విచారించారు.  అలాగే మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, కూతురు అనూషకు  సంబంధించిన 113 ఎకరాల భూమి విషయంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మెడ చుట్టూ 10, పొత్తి కడుపులో  మూడు చోట్ల.. మొత్తం 13 చోట్ల మల్లారెడ్డిపై కత్తులతో దాడి జరిగినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios