హైదరాబాద్ నగరంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. పోలీసులపైనే దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇటీవల పోలీసులు ఇద్దరు రౌడీలను అరెస్టు చేశారు. దీంతో... ఆగ్రహంతో ఊగిపోయిన ఇతర రౌడీ మూకలు... పోలీస్ స్టేషన్ పై దాడి చేశాయి. ఈ సంఘటన హైదరాబాద్ హబిబ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఓ ఇద్దరు రౌడీలను హబిబ్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న అనుమానంతో రౌడీమూకలు హబిబ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడుతూ వారిపై కూడా దాడికి యత్నించారు. అంతు చూస్తామంటూ పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.