నిత్యం ప్రమాదాలు, ఇరుకుగా ఉండే రోడ్డు, అస్తవ్యస్తంగా ట్రాఫిక్ నిర్వహణ వెరసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై ప్రయాణమంటే వాహనదారులు భయపడిపోతున్నారు.

పెరుగుతున్న వాహనాలకు, రద్దీకి అనుగుణంగా దశాబ్ధాల కాలంగా ఈ జాతీయ రహదారిని విస్తరించపోవడంతో పాటు ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో వరంగల్ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

బీబీనగర్ వద్ద టోల్‌గేట్ దాటిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేస్తుండటంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఎంతో మంది మృత్యువాతపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఈ మార్గంలో ప్రయాణం ఖచ్చితంగా ప్రాణాంతకమే.

మార్చి 22 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వరుస ప్రమాదాలలో అయినవారిని కోల్పోతున్న వారు ప్రభుత్వం, పోలీసులపై మండిపడుతున్నారు.

ట్రాఫిక్ పోలీసుల దృష్టంతా చలాన్లపైనే ఉంటుంది కానీ...రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి జంక్షన్‌లోనూ పోలీసులు ఉండే విధంగా చర్యలు తీసుకోకపోవడం, భారీ వాహనాలను నియంత్రించలేకపోవడం, జంక్షన్ల వద్ద, బస్‌షెల్టర్ల వద్ద ఆటో స్టాండ్‌లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.