రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నుంచి ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఓ రోగిని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా రావిరాల వద్ద ఔటర్ రింగ్ రోడ్‌ ఎగ్జిట్ 13 వద్ద శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.