పండగ పూట దైవదర్శనానికి వెళ్లివస్తున్న దంపతులతో పాటు మరో మహిళ మృతిచెందిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల దర్శనంకోసం వెళ్లి వస్తున్న భార్యభర్తలు ప్రయానిస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో మహిళ కూడా మృతిచెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలో నివాసముండే  లక్ష్మి, అనంతయ్యలు భార్యాభర్తలు. అనంతయ్య యాలాల మండలం జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే పాఠశాలకు వేసవి సెలవులు ఉన్నప్పటికి శ్రీరామ నవమి వేడుకలు ఈ గ్రామంలో ఘనంగా జరుతుండటంతో భార్యతో కలిసి ఉదయమే అక్కడికి వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే వుండి ప్రయాణికుల ఆటోలో తాండూరు బయలుదేరారు. 

అయితే వీరు ప్రయాణిస్తున్న ఆటో మార్గమద్యలో ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటోలో ఎగిరి రోడ్డుపక్కన పడిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు మరో మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు తెలిపారు.  ప్రమాదానికి కారణమైన వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని... అందుకోసం ప్రత్యక్ష సాక్షులను, బాధితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.